High Court Granted Bail To Samba Sivarao In The AP Fiber Net Case :
ఏపీలోని జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు హైకోర్టులో మరో మొట్టికాయ పడిందనే చెప్పాలి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను టార్గెట్ చేస్తూ.. ఏపీ ఫైబర్ నెట్ లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని సంచలన ఆరోపణలు చేసిన జగన్ సర్కారు.. ఈ కేసులో రెండు రోజుల క్రితం సంస్థ మాజీ ఎండీ కోగంటి సాంబశివరావును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తనపై పెట్టిన కేసులను కొట్టివేయడంతో పాటుగా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సాంబశివరావు దాఖలు చేసిన పిటిషన్ కు హైకోర్టు సానునకూలంగా స్పందించింది. సోమవారం ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సాంబశివరావుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సాంబశివరావు వాదనలను సానుకూలంగా స్పందించిన హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
2 వేల కోట్లు అని.. 121 కోట్లకు తగ్గి..
టీడీపీ హయాంలో జరిగిన ఏపీ ఫైబర్ నెట్ పనుల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ జగన్ అండ్ కో చాలా కాలం నుంచి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. వందల కోట్ల మేర పనులు జరిగితే.. ఏకంగా రూ.2 వేల కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ స్వయంగా జగనే గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ రూ.2వేల కోట్ల అక్రమాలను జగన్ సర్కారే రూ.121 కోట్లుగా తగ్గించేసి సీఐడీ చేత కేసు నమోదు చేయించింది. జగన్ సర్కారు ఆదేశాలతో కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు.. ఆ మరునాడే సాంబశివరావుతో పాటు హరిప్రసాద్, గోపీనాథ్ లను విచారణకు పిలిచింది. వరుసగా మూడు రోజుల పాటు సాంబశివరావును విచారించిన సీఐడీ.. శనివారం మధ్యాహ్నం తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఆదివారం ఎలాగూ కోర్టుకు సెలవు దినమన్న భావనతోనే శనివారం మధ్యాహ్నం తర్వాత సాంబశివరావును సీఐడీ అరెస్ట్ చేసిందన్న వాదనలు కూడా వినిపించాయి.
కండీషనల్ బెయిల్ మంజూరు
అయితే సీఐడీ వ్యూహాన్ని చాలా వేగంగానే పసిగట్టిన సాంబశివరావు వెనువెంటనే బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని, ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టును అభ్యర్థించిన సాంబశివరావు.. 48 గంటల్లోగా తనకు బెయిల్ లభించకపోతే తన ఉద్యోగమే పోతుందని, ఈ కారణంగా తనకు తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ ను సోమవారం ఉదయం విచారించిన కోర్టు.. సాంబశివరావు వాదనలతో ఏకీభవించింది. ఆ వెంటనే ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Must Read ;-మొత్తంగా టీడీపీపైనే పెట్టేస్తే పోయేదిగా