CID Probe Into AP FiberNet Scandal Begins :
ఏపీ ఫైబర్ నెట్ లో భారీ కుంభకోణం జరిగిందని చెబుతున్న జగన్ సర్కారు వాదనపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో తొలుత ఏకంగా రూ.2 వేల కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ సంచలన ఆరోపణలు చేసిన జగన్ సర్కారు.. తాజాగా రూ.121 కోట్ల మేర అక్రమాలు మాత్రమే జరిగాయంటూ తన మాటనే సరిచేసుకుంది. అంతేకాకుండా రూ.121 కోట్ల అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కూడా సీఐడీకి ఆదేశాలు జారీ చేయగా.. సీఐడీ దర్యాప్తు సోమవారం నాడు కేసు నమోదు చేసి.. ఆ మరునాడు.. అంటే మంగళవారమే ఈ వ్యవహారంతో సంబంధం ఉందని భావిస్తున్న ఫైబర్ నెట్ మాజీ ఎండీ సాంబశివరావు, కమిటీ సభ్యుడు వేమూరి హరిప్రసాద్, గోపీచంద్ లను విచారణకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయమే.. విజయవాడలోని సత్యనారాయణపురం పరిధిలోని సీఐడీ కార్యాలయానికి సాంబశివరావు, హరిప్రసాద్ లు చేరుకున్నారు. సీఐడీ విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఈ సందర్భంగా వారు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
అవినీతే జరగలేదు
ఫైబర్ నెట్ లో అసలు అవినీతే జరగలేదని వేమూరి హరిప్రసాద్ తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తాను ముందు నుంచి చెబుతూనే ఉన్నానని, అయితే ఇప్పటిదాకా తన వాదనను ఎవరు కూడా విన్న పాపాన పోలేదని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా అవినీతి జరిగిన సమయంలో కీలక స్థానాల్లో ఉన్న తమ వివరణ వినకుండానే అవినీతి జరిగిపోయిందంటూ ప్రకటనలు జారీ చేయడం ఏమిటని కూడా హరిప్రసాద్ ప్రశ్నించారు. అసలు ఫైబర్ నెట్ టెండర్ల సమయంలో జరిగింది ఇదీ అంటూ తాను ఇప్పటికే పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బహిరంగంగానే వివరాలు వెల్లడించానని, అయితే తన వాదనలను సీఐడీ అధికారులు గానీ, జగన్ సర్కారు గానీ పరిగణనలోకి తీసుకోవడం కాదు కదా.. అసలు తానేమీ మాట్లాడనట్టే, ఈ వ్యవహారంపై తాను నోరు విప్పనట్టే వ్యవహరిస్తున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సీఐడీ విచారణ పేరిట అయినా ఇప్పుడు తన వాదనలను వినేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సీఐడీ విచారణ అంటే తానే భయపడటం లేదని, నాడు జరిగిన విషయాలను సమగ్రంగా వివరిస్తానని, సీఐడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని, ఈ వ్యవహారంలో అసలు అవినీతే జరగలేదని నిరూపిస్తానని హరిప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఐడీ ఆరోపణలేంటంటే..?
సీఐడీ నమోదు చేసిన కేసులోని వివరాలను సోమవారం నాడు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతం రెడ్డి వివరించారు. గౌతం రెడ్డి వివరాల ప్రకారం.. ఫైబర్ గ్రిడ్ కు సంబంధించి రూ.321 కోట్ల పనులకు టెండర్లు పిలిచారట. అందులోనే ఏకంగా రూ.121 కోట్ల మేర అక్రమాలు జరిగాయట. టెండర్ దక్కించుకున్న టెరా సాఫ్ట్ లో భాగస్వామిగా ఉన్న హరికృష్ణ.. తరువాత ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో చేరారట. ఆపరేషన్ కాంట్రాక్ట్ దక్కించుకున్న కోటేశ్వరరావు టీడీపీ అధినేత చంద్రబాబుకు బంధువట. అప్పటికే బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరాసాఫ్ట్ పై నిషేధం ఎత్తివేసి మరుసటి రోజు టెండర్లకు అవకాశం ఇచ్చారట. టెండర్ అప్పగించడం కోసం అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారట. పరికరాలు ఇవ్వకుండానే నిధులు విడుదల చేశారట. నాణ్యత లేని మెటీరియల్ వాడడం వల్లనే రూ.62 కోట్లు నష్టం వాటిల్లిందట. రూ.22 కోట్లకు బిల్లులే లేవట. అయినా చెల్లింపులు జరిగాయట. డిజైన్స్ మార్చడం వల్ల మరో రూ.22 కోట్ల నష్టం జరిగిందట.










