Fibernet Case Handed Over To AP CID :
సీఐడీ విభాగం.. ఎందుకో గానీ ప్రతి చిన్న విషయంలోనూ ఏపీ ప్రభుత్వానికి పదే పదే గుర్తుకు వస్తోంది. తన మనసులోని ప్లాన్ ను పక్కాగా అమలు చేసే విభాగంగా జగన్ సర్కారు సీఐడీని గుర్తించినట్లే కనిపిస్తోంది. అయితే ఆ సంస్థ దర్యాప్తు చేపట్టిన కేసుల్లో ఎంతగా అప్రతిష్ఠ దక్కిందన్న విషయాన్ని మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పాలి. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు దర్యాప్తును ఏపీ సీఐడీనే చేపట్టింది. కోర్టుల్లో జగన్ సర్కారుకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై లా అండ్ ఆర్డర్ పోలీసులు దాఖలు చేయాల్సిన కేసులను సీఐడీనే దాఖలు చేసేసి స్వామి భక్తిని చాటుకోగా.. ఈ వ్యవహారంలో జగన్ సర్కారు ఏ తరహాలో ఉక్కిరిబిక్కిరి అయ్యిందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవన్నీ వరుసగానే.. వెంటవెంటనే జరిగిన పరిణామాలు. ఈ కేసుల్లో తగిలిన దెబ్బలను మరిచిపోయిన జగన్ సర్కారు.. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ కేసు దర్యాప్తును కూడా సీఐడీకే అప్పగించింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కారుకు కోర్టుల్లో మరో భంగపాటు తప్పదా? అన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఏమిటీ ఫైబర్ కేసు..?
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి ఆధ్వర్యంలోని గత ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించిన పనులు మొదలు కాగా.. టెండర్ల ఆహ్వానం, కాంట్రాక్టర్ ఎంపికలో పలు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ ఇప్పటికే పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తాము అదికారంలోకి వచ్చిన నేపథ్యంలో వందల కోట్ల మేర అవినీతి జరిగిన ఈ తంతుపై దర్యాప్తు చేయించి దోషులను జైలుకు పంపుతామని కూడా ప్రకటించింది. ఈ వ్యవహారంలో నాడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ ను బుక్ చేయడమే లక్ష్యంగా ఈ వ్యవహారంపై దర్యాప్తునకు వైసీపీ సర్కారు ఆదేశాలు జారీ చేయనుందన్న వాదనలు వినిపించాయి. అనుకున్నట్లుగానే ఈ వ్యవహారంపై దర్యాప్తునకు అసెంబ్లీలో తీర్మానం చేసిన వైసీపీ సర్కారు.. ఆ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టాలంటూ కేంద్రానికి లేఖ రాసింది. అయితే కేంద్రం నుంచి గానీ, సీబీఐ నుంచి గానీ జగన్ సర్కారు విజ్ఞప్తి పట్ల స్పందనే కనిపించలేదు. దీంతో తాము ఆశించిన మేర నారా లోకేశ్ ను బుక్ చేయడం లేటవుతుందన్న భావనతో తాజాగా జగన్ సర్కారు ఈ కేసు దర్యాప్తును ఏపీ సీఐడీకి అప్పగిస్తూ ఆదివారం హడావిడిగా ఉత్తర్వులు జారీ చేసింది.
సీఐడీ పట్టేస్తుందా?.. పట్టిస్తుందా?
అయితే ఏపీ సీఐడీ పనితీరు ఇటీవలి కాలంలో ఏ రీతిన ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ పలువురిని విచారించిన సీఐడీ.. కోర్టు అంగీకరించే రీతిలో ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా సేకరించలేకపోయింది. వెరసి ఈ కేసు దర్యాప్తును నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు నుంచి గుణపాఠం నేర్చుకోని జగన్ సర్కారు.. రఘురామపైకి కూడా సీఐడీని ఉసిగొల్పింది. జగన్ తమకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న భావనతో.. మరింత దూకుడు ప్రదర్శించిన సీఐడీ రఘురామరాజును హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అమరావతి తరలించడం, ఆ తర్వాత ఆయనపై థర్డ్ డిగ్రీ, కోర్టులో దోషిగా నిలిచిన తీరు, ఫలితంగా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు.. అంతిమంగా జగన్ సర్కారుపై రఘురామ చేస్తున్న వరుస దాడితో సీఐడీ పనితీరు ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలోతాజాగా ఏపీ ఫైబర్ నెట్ కేసును సీఐడీకే అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న జగన్ సర్కారు మరో ఎదురు దెబ్బకు రెడీ అయిపోయిందన్న కోణంలో ఆసక్తికర సెటైర్లు పడుతున్నాయి.
Must Read ;- జగన్ ప్రాజెక్టుకు ఏపీలోనూ వ్యతిరేకతే!











