టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిపై దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా ఇప్పటిదాకా సింగిల్ కేసును కూడా బుక్ చేయలేకపోయారు. ఫైబర్ గ్రిడ్‌లో ఏకంగా రూ.2 వేల కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపించిన జగన్ సర్కారు.. ఈ కేసులో నిజాలను నిగ్గు తేల్చి బాధ్యులైన వారు ఎంతటివారైనా జైలుకు పంపిస్తామని కూడా ఇప్పటికే ప్రకటనలు గుప్పించింది. అయితే తాజాగా ఈ వ్యవహారంలో జరిగిన అక్రమాలు రూ.2 వేల కోట్లు కాదని.. కేవలం రూ.121 కోట్లేనని జగన్ సర్కారు ఓ నిర్ధారణకు వచ్చిందట. జగన్ సర్కారు ఆదేశాల మేరకు ఈ వ్యవహారంలో రూ.121 కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ సీఐడీ అధికారులు సోమవారం కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతం రెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
సీఐడీ కేసులోని అంశాలేంటంటే..?
ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతం రెడ్డి విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఫైబర్ గ్రిడ్ కు సంబంధించి రూ.321 కోట్ల పనులకు టెండర్లు పిలిచారట. అందులోనే ఏకంగా రూ.121 కోట్ల మేర అక్రమాలు జరిగాయట. టెండర్ దక్కించుకున్న టెరా సాఫ్ట్ లో భాగస్వామిగా ఉన్న హరికృష్ణ.. తరువాత ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో చేరారట. ఆపరేషన్ కాంట్రాక్ట్ దక్కించుకున్న కోటేశ్వరరావు టీడీపీ అధినేత చంద్రబాబుకు బంధువట. అప్పటికే బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరాసాఫ్ట్ పై నిషేధం ఎత్తివేసి మరుసటి రోజు టెండర్లకు అవకాశం ఇచ్చారట. టెండర్ అప్పగించడం కోసం అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారట. పరికరాలు ఇవ్వకుండానే నిధులు విడుదల చేశారట. నాణ్యత లేని మెటీరియల్ వాడడం వల్లనే రూ.62 కోట్లు నష్టం వాటిల్లిందట. రూ.22 కోట్లకు బిల్లులే లేవట. అయినా చెల్లింపులు జరిగాయట. డిజైన్స్ మార్చడం వల్ల మరో రూ.22 కోట్ల నష్టం జరిగిందట. ఇదీ మొత్తంగా గౌతం రెడ్డి చెప్పిన ఫైబడ్ గ్రిడ్ కుంభకోణం.
రూ.2 వేట కోట్ల మాటేమిటో?
ఫైబర్ గ్రిడ్ లో చంద్రబాబు బంధువులు, సన్నిహితులు అడ్డంగా డోచేశారని, ఈ వ్యవహారానికి నాడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూ పాత్ర ఉందంటూ జగన్ సర్కారు సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా ఈ కేసులోనే లోకేశ్ ను అరెస్ట్ చేయనున్నట్లుగా కూడా జగన్ అండ్ కో తమ ఇన్నర్ మీటింగ్స్‌లో చంకలు గుద్దుకుంది. రూ.2 వేల కోట్ల అక్రమాలు బయటపడితే.. ఇక లోకేశ్ జైలుకేనని, టీడీపీ కథ క్లోజేనని కూడా ప్రచారం చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని జగన్ ఏకంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లుగా కూడా ప్రచారం సాగింది. తీరా చూస్తే.. తాము చెప్పిన రూ.2 వేల కోట్లకు బదులుగా కేవలం రూ.121 కోట్ల మేర మాత్రమే అక్రమాలు జరిగాయని, వాటిపై దర్యాప్తు చేస్తున్నామని జగన్ సర్కారు పేర్కొనడం గమనార్హం.
Must Read ;- జగన్ ను నమ్మి అమూల్ నిండా మునిగిందే!










