పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కెరీర్‌లో మొదటి పాన్ ఇండియన్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వకీల్ సాబ్, భీంలా నాయక్ వంటి హిట్స్ తో జోరుమీద ఉన్న పవర్ స్టార్ స్టామినా ఏంటో ప్రపంచం మొత్తం ఈ సినిమాతో చూడబోతోందని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.
దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ మూవీ 17వ శతాబ్దంలోని మొఘలుల కాలంనాటి కథతో తెరకెక్కుతోంది.అగ్ర నిర్మాత ఏ ఎం రత్నం నిర్మిస్తున్న హరిహర వీరమల్లు, టీజర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేసింది. బాహుబలి సిరీస్ తర్వాత వార్ నేపథ్యంగా టాలీవుడ్‌లో పీరియాడిక్ సినిమాగా హరిహర వీరమల్లు రాబోతోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఈ సినిమాను అనంతరం పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్ అనే మూవీ షూటింగ్‌లో జాయిన్ అవుతారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించబోతోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు గనక పూర్తైతే 2023 సమ్మర్ కానుకగా భవదీయుడు విడుదల చేయనున్నారని సమాచారం.