ఏపీ సీఎంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టగానే.. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ సమూలంగా ప్రక్షాళన చేస్తామని, తమ పాలనతో 30 ఏళ్ల దాకా సీఎంగా జగనే కొనసాగుతుతారన్న మాటలు వైసీపీ నుంచి చాలా గట్టిగానే వినిపించాయి. ఇక సర్కారీ స్కూళ్ల విషయంలో అయితే వైసీపీ చెప్పిన మాటలు కోటలను దాటిపోయింది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా తీర్చిదిద్దుతామని, అందుకోసమే.. నాడు-నేడు పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా వైసీపీ చెప్పింది. అనుకున్నట్లుగానే ఆ పథకాన్ని ప్రారంభించింది. అందుకోసం భారీ ఎత్తున నిధులను కూడా విడుదల చేసింది. అయితే ఫలితం ఏమిటన్నది ఎక్కడికో వెళ్లి చూడాల్సిన అవసరం లేదు. సీఎం జగన్ తాడేపల్లిలో ముచ్చటపడి కట్టించుకున్న ప్యాలెస్ కు కూతవేటు దూరంలో ఉన్న సర్కారీ స్కూళ్లను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.
ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు
జగన్ ప్యాలెస్.. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్యాలెస్ కు కూతవేటు దూరంలో తాడేపల్లి రెండో వార్డులో ఓ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. దానికి సమీపంలో యానాదుల కాలీలోనూ మరో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ రెండు పాఠశాలలను చూస్తే.. జగన్ సర్కారు అమలు చేస్తున్న నాడు- నేడు ఏ రీతిన అమలు అవుతుందో తేలిపోతుంది. ఈ రెండు పాఠశాలల్లో పిల్లలకు కూర్చునేందుకు బెంచీలు కాదు కదా.. ఉపాధ్యాయులు కూర్చునేందుకు కూడా సరైన కుర్చీలు కనిపించడం లేదు. పిల్లలంతా వరుసబెట్టి నేలపైనే కూర్చుని పాఠాలు వింటున్నారు.
ఈ రెండు పాఠశాలల్లో ఇలా..
తాడేపల్లి 2వ వార్డులో మండల పరిషత్ పాఠశాలలో నేల మీద ఒకే గదిలో పాఠాలు వింటూ పిల్లలు కనిపిస్తున్నారు. ఈ పాఠశాలలో దాదాపుగా వంద మంది విద్యార్థులు ఉండగా.. వారికి విద్యాబోధన చేసేందుకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక వంద మంది విద్యార్థులున్నా.. ప్రాథమికోన్నత పాఠశాల అంటే.. ఏడు తరగతులు ఉంటాయి కదా. అయితే అన్ని తరగతులకు సంబంధించి రెండంటే.. రెండు గదులు మాత్రమే ఉన్నాయి. అదనపు గదుల మాటే ఇప్పటిదాకా లేదు. అసలు అదనపు గదులు కడదామన్నా స్థలం లేదట. ఇక యానాది కాలనీలోని పాఠశాల విషయానికి వస్తే.. ఇక్కడ 18 మంది విద్యార్థులున్నారు. వీరి కోసం ఒకే ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారు. గదులు రెండున్నా.. ఒకే టీచర్ తోనే ఈ పాఠశాల నడుస్తోంది. వెరసి రెండు గదులున్నా.. అన్ని తరగతుల విద్యార్థులంతా ఓకే గదిలో ఒకే టీచర్ ముందు నేల మీద కూర్చోక తప్పడం లేదు.










