ఘంటసాల .. పాటల పంటశాల .. ఎక్కడో ఒకచోట ఆయన పాట మోగుతూనే ఉంటుంది .. ఆ స్వరంలోని మాధుర్యాన్ని వెదజల్లుతూనే ఉంటుంది. దేవాలయాల్లో .. ఉత్సవాల్లో .. వేడుకల్లో నేటికీ ఘంటసాల గొంతు వినిపిస్తూనే ఉంటుంది .. వీనులవిందు చేస్తూనే ఉంటుంది. గాయకుడిగా .. సంగీత దర్శకుడిగా ఘంటసాల సాధించిన విజయాలు అనేకం. సంగీత సాధనలో తరించిన మహర్షి వంటి ఆ మహాగాయకుడిని మరిచిపోవడం అసాధ్యం .. కానీ ఆయనను తెలుగు చిత్రపరిశ్రమ మరిచిపోయిందంటూ ఘంటసాల తనయుడు రత్నకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా ఇంటర్వ్యూలో ఘంటసాల రత్నకుమార్ మాట్లాడుతూ .. “ఘంటసాల కుటుంబ సభ్యులుగా ఎక్కడికి వెళ్లినా మమ్మల్ని ఎంతగానో గౌరవిస్తున్నారు. ఆయన పేరు వినిపించగానే ముందుగా లేచి నిలబడి నమస్కారాలు పెట్టేస్తారు. ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు .. అభిమానాన్ని చూపుతారు. నిజంగా ఇలాంటి ఆదరణ వేరెవరికీ దొరకదేమో. ఆ సమయంలో మాత్రం చాలా ఆనందం కలుగుతుంది .. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. మాకు ఇంతటి గౌరవ మర్యాదలు దక్కడానికి కారకులు మా నాన్నగారే.
Must Read ;- తెలుగు తెర మరువని మల్లెపువ్వు లక్ష్మీ (జన్మదిన ప్రత్యేకం)

ఘంటసాల గారి జయంతి .. వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు అనేకమంది .. అనేక ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యఅతిథులుగా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారు కూడా. మా కుటుంబంలో మేము ఎవరికి వీలైతే వాళ్లం వెళ్లడానికే సాధ్యమైనంతవరకూ ప్రయత్నిస్తుంటాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాన్నగారి జయంతి – వర్ధంతి ఎవరికీ గుర్తులేదు .. నిజంగా ఇది చాలా బాధాకరం. ఈ మాట అంటే అందరూ నా మీదకి యుద్ధానికి వస్తారు. మేమెక్కడ మరిచిపోయామండీ అంటారు .. గుర్తుపెట్టుకుని ఏం చేయాలంటారు? ఆయనను గుండెల్లో పెట్టుకున్నది తెలుగు ప్రేక్షకులే. అందుకే వాళ్లందరికీ నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.