జీవితం ఒక్కటే .. అది కూడా చాలా చిన్నది .. ఎక్కడ ఎప్పుడు ఎలా ఆగిపోతుందో తెలియదు. అలా అని చెప్పేసి కుమిలిపోతూ కూర్చోవద్దు. నువ్వేంటో ఈ ప్రపంచానికి తెలియాలి .. అనుకున్నది సాధించాలి. అందుకోసం ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకు వేయాలి .. ఉత్సాహాన్ని ఊపిరిగా మార్చుకుని కాలంతో పాటు పరుగులు తీయాలి. విజయాలు ఎరుగని జీవితానికి విలువలేనట్టే అనే ఆలోచనా ధోరణితో తన కెరియర్ ను ఆరంభించిన కథానాయికగా ‘లక్ష్మీ’ కనిపిస్తుంది. వెండితెరపై వెన్నెలధారలా కనిపించే లక్ష్మీని చూసి అప్పట్లో పడుచు మనసులను పారేసుకోని కుర్రాళ్లు లేరు. ఆమె కళ్ల వాకిళ్లలో మడతమంచాలు వాల్చుకుని సేదతీరాలకునే అభిమానుల సంఖ్య వేలాది వేలు.
కళ్ల దోసిళ్లతో విరహాన్ని ఒలకబోయడం .. చెక్కిళ్లలో చిక్కుకున్న సిగ్గులను జారవిడవడం .. అక్షరాలకు అందని హావభావాలను పెదవులపై నాట్యం చేయించడం లక్ష్మీ ప్రత్యేకత. గ్లామర్ పరంగానే కాదు .. వాయిస్ పరంగాను .. నటన పరంగాను ఆమె మిగతా కథానాయికలకు భిన్నంగా కనిపిస్తూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
జయసుధ .. జయప్రద .. శ్రీదేవి జోరు ఒక రేంజులో సాగుతుండగా, లక్ష్మీ తన ప్రత్యేకతను చాటుకోవడం .. ప్రశంసలను అందుకోవడం .. అలనాటి స్టార్ హీరోల సరసన అవకాశాలను దక్కించుకోవడం గొప్ప విషయం.
Must Read ;- అందాల హనీ.. మెహ్రీన్ ఏమైపోయిందబ్బా?
లక్ష్మీ తల్లిదండ్రులైన వైవీరావు .. రుక్మిణి ఇద్దరూ కూడా చిత్రపరిశ్రమకి చెందినవారే. అందువలన నటన అనేది ఆమెకి పుట్టుకతోనే వచ్చింది. ఎస్వీ రంగారావు దర్శక నిర్మాతగా వ్యవహరించిన ‘బాంధవ్యాలు’ సినిమా ద్వారా లక్ష్మీ తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ వెంటనే ‘నిండుదంపతులు’ .. ‘కొడుకు కోడలు’ .. ‘జీవనతరంగాలు’ .. ‘ పల్లెటూరి బావ’ .. ‘పుట్టినిల్లు మెట్టినిల్లు’ వంటి చిత్రాలు ఆమె ఖాతాలో చేరిపోయాయి. అలనాటి నలుగురు అగ్రకథానాయికలలో ఏఎన్నార్ .. శోభన్ బాబులతో లక్ష్మీ ఎక్కువ సినిమాలు చేశారు. గ్లామర్ డాల్ పాత్రలు .. డోంట్ కేర్ పాలసీ తరహా పాత్రలు .. నిర్మొహమాటంగా నిలదీసే పాత్రల్లో ఆమె తనకి సాటిలేదనిపించుకున్నారు.
శోభన్ బాబుతో చేసిన ‘కోడెనాగు’ .. ‘మల్లెపువ్వు’ సినిమాలు లక్ష్మీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘మల్లెపువ్వు’ సినిమాలో ‘మల్లిక’ అనే వేశ్యపాత్రలో ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. ‘చిన్నమాట .. ఒక చిన్నమాట’ అనే పాట ఇప్పటికీ ఏ మూల వినిపించినా, అప్పట్లో కళ్లతో లక్ష్మీ చేసిన గారడి గుర్తొస్తుంది. అభిమానుల మనోఫలకంపై ఆ పాత్ర ఎప్పటికీ నిలబడిపోతుంది. ఇక లక్ష్మీ కెరియర్లో ప్రత్యేకమైన చిత్రంగా ‘పంతులమ్మ’ను చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఆమె పోషించిన శారద పాత్ర .. ఆ పాత్రను ఆమె సజీవంగా ఆవిష్కరించిన తీరు గొప్పగా ఉంటుంది. తెలుగులో పాటల పరంగా లక్ష్మీకి నూటికి నూరు మార్కులు తెచ్చిపెట్టిన సినిమా ఇదే.
కెరియర్ పరంగా ఎలాంటి ఆటుపోట్లు ఎదురైనా లక్ష్మీ తట్టుకుని నిలబడ్డారు. అలాగే ఆమె వైవాహిక జీవితం కూడా అనేక ఒడిదుడుకులకు లోనైంది. అయినా ఆ సమస్యలను ఆమెనే పరిష్కరించుకుంటూ వచ్చారు. తన వ్యక్తిగత విషయాల్లో ఆమె ఎవరినీ జోక్యం చేసుకోనిచ్చేవారు కాదు. ఆ విషయాలను ఆమె దగ్గర ప్రస్తావించే ధైర్యం కూడా ఎవరూ చేసేవారు కాదు. ఎప్పుడు చూసినా నిబ్బరంగా .. నిర్భయంగా కనిపిస్తూ, పూర్తి ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తూ ఉండటమే అందుకు కారణమని చెప్పుకోవాలి. ఏదేనైనా ఆమె తన దృష్టిని నటనపై నుంచి మళ్లించలేదనేది వాస్తవం. తన వ్యక్తిగత విషయాలను సెట్లోకి తీసుకురాలేదనేదీ వాస్తవం.
కాలంతో పాటు లక్ష్మీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు .. అయితే ఆమె పాత్రలకి గల ప్రాధాన్యత తగ్గకపోవడం గమనించదగిన విషయం. ‘జీన్స్’ మూవీలో కృష్ణవేణిగా .. ‘మురారి’లో గోపమ్మగా .. ఈ మధ్య కాలంలో చేసిన ‘ఓ బేబీ’లోని సావిత్రి పాత్ర .. ‘నానీస్ గ్యాంగ్ లీడర్‘ లోని సరస్వతి పాత్ర అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ‘మిథునం’ సినిమాలో బాలు భార్యగా బుచ్చి లక్ష్మీపాత్రలో ఆమె ఒదిగిపోయారు .. చెమ్మగిల్లిన గుండె గదుల్లో ఇమిడిపోయారు. లక్ష్మీ వయసు పెరుగుతున్నా ఆమెలో ఉత్సాహం మాత్రం ఎంతమాత్రం తగ్గలేదు. అందువల్లనే ఆమె తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో కలుపుకుని 400కి పైగా సినిమాల్లో నటించారు. ఉత్తమనటిగా అనేక అవార్డులను అందుకున్నారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు … ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ది లియో న్యూస్’ టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
— పెద్దింటి గోపీకృష్ణ
Also Read ;- సైలెంట్ గా పెళ్లి చేసుకున్నకత్తి హీరోయిన్