టీవీ నటి శ్రావణి ఆత్మహత్యకు ముందు రోజు ఆమెను చిత్ర హింసకు గురిచేయడమే కారణమని తెలుస్తోంది. దాంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. శ్రావణి ఆత్మహత్యకు ముందు రోజు జరిగిన సంఘటనలో ఆర్.ఎక్స్. 100 చిత్ర నిర్మాత అశోక్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అశోక్ రెడ్డిని ఈరోజు పోలీసులు అరెస్టు చేశారు. దేవరాజ్, శ్రావణి విడిపోవడానికి సాయికృష్ణ, అశోక్ రెడ్డిలే కారణమనేది తెలుస్తోంది.
ఆమె దేవరాజ్ కు దగ్గర కావడాన్ని అశోక్ రెడ్డి జీర్ణించుకోలేకపోయినట్లు భావిస్తున్నారు. అమీర్ పేటలో ఓ హోటల్ వద్ద శ్రావణి, దేవరాజ్ ల మధ్య గొడవ తర్వాత శ్రావణిని సాయి ఇంటికి తీసుకొచ్చిన అనంతరం అశోక్ రెడ్డితో కలిసి ఆమెను హింసించినట్లు పోలీసులకు తెలిసిన సమాచారం. ఈ విషయంలో పోలీసులు తగిన ఆధారాలు సేకరించడంతో ఈ కేసులో అశోక్ రెడ్డి పూర్తిగా ఇరుక్కుపోయారు.
ఇప్పటికే ఆయనను ఈ కేసులో ఏ2 నిందితుడిగా పోలీసులు చేర్చారు. నిర్మాత అశోక్ రెడ్డిని ఈరోజు మధ్యాహ్నం పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా అవకాశాలను శ్రావణికి ఎరగా చూపి ఆమెను అతను లోబరుచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సోమవారం ఎస్.ఆర్.నగర్ పోలీసుల ముందుకు తాను విచారణకు వస్తానని అశోక్‌రెడ్డి చెప్పినా రాలేదు. చివరికి పోలీసులు గాలించి అతన్ని పట్టుకున్నారు.











