హైదరాబాద్ నగరానికి కొన్ని రోజులుగా వరుసగా భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భూమి ఉన్నట్లుండి స్వల్పంగా కంపిస్తోంది. తాజాగా వనస్థలిపురంలోనూ గురువారం స్వల్పంగా భూమి కంపించినట్లు తెలిసింది. అయితే వరుసగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపిస్తుండటం ఆందోళన కలిగించే విషయం. తాజాగా మరోసారి గురువారం వనస్థలిపురంలో తెల్లవారుజాము దాదాపు 5 గంటల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించినట్లు సమాచారం. 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో మూడు సార్లు భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. అందరూ నిద్రలో ఉండే సమయంలో పెద్దగా శబ్దాలు వచ్చి భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై రోడ్లపైకి పరుగులు పెట్టారు.
మూడు ప్రాంతాల్లో..
హైదరాబాద్‌లోని వనస్థలిపురం, బిఎన్‌రెడ్డి నగర్, వైదేహి నగర్‌లో ఉదయం ఐదు గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. మొదటి సారి ప్రకంపనలు వచ్చినప్పుడు కేవలం ఒక సెకండ్ కాలంపాటు స్వల్పంగా భూమి కంపించి, ఆ తరువాత ఉదయం సుమారు 6.45 గంటల ప్రాంతంలో వైదేహి నగర్ కాలనీలో పెద్ద శబ్దాలతో భూమి కంపించినట్లు తెలిసింది. మరోకసారి ఉదయం 7.08 గంటల ప్రాంతంలో మళ్లీ భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇలా రెండు గంటల్లో ఏకంగా 3సార్లు భూ కంపించడం ఆ ప్రాంతవాసుల్లో భయాందోళనలు కలిగించింది.
ఈక్రమంలో భూకంపించిన ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే గతంలో బోరబండలోనూ స్వల్పంగా భూ ప్రకంపనల ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వనస్థలిపురంలో భూమి కంపించడంతో హైదరాబాద్ వాసుల్లో ఓ రకమైన భయం వెంటాడుతోంది. తాజాగా నమోదైన భూ ప్రకంపనల తీవ్రత రిక్టేర్ స్కేలుపై 0.5గా నమోదైందని ఎన్‌జీఆర్ఐ డైరెక్టర్ తెలిపారు.