మహాత్మాగాంధీ 73వ వర్ధంతి నేడు. నేటికీ ఆయన అనుసరించిన మార్గం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. అహింస, సత్యాగ్రహ మార్గాల ద్వారా భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబరు 2న గుజరాత్ లోని పోరుబందరులో జన్మించారు. ఆ రోజుల్లో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. అలా 13 సంవత్సరాలకే కస్తూర్బాతో గాంధీ వివాహం జరిగింది. విద్యాభ్యాసం పోరుబందరు, రాజ్ కోట్ లో జరిగింది. 19 సంవత్సరాల వయసులో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండు వెళ్లారు. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం మద్యం, మాంసం, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నారు.
ఇంగ్లాండ్ చదువులు మలుపు తిప్పాయి
న్యాయ శాస్త్రం అభ్యసించడానికి ఇంగ్లండ్ వెళ్లిన గాంధీ, కేవలం న్యాయ శాస్త్ర పుస్తకాల పఠనానికే పరిమితం కాలేదు. అనేక గ్రంధాలను పఠించారు. వాటిలో పాటు పలు మతాల పవిత్ర గ్రంధాలను చదివారు. అన్నీ మతాల సారాంశం ఒక్కటేనని గ్రహించారు. ఆయన పఠించిన మత గ్రంధాల ప్రభావం ఆయన జీవితంలో ప్రతి దశలో కనిపిస్తూనే ఉంటుంది. 1891లో పట్టభద్రుడై గాంధీ భారత్ తిరిగి వచ్చారు. ముంబాయి, రాజ్ కోట్ లో ప్రాక్టీసు పెట్టినా పెద్దగా రాణించలేదు.
అంతలోనే 1893లో దక్షిణాప్రికాలో నాటల్ లో న్యాయవాదిగా అవకాశం దొరికింది. సంవత్సరకాలానికి 1893లో దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీ అక్కడే దాదాపు 21 సంవత్సరాలు గడిపారు. నల్ల జాతీయుడు కావడం వల్ల రైలు బండి మొదటి తరగతి నుంచి గాంధీని గెంటివేశారు. హోటళ్లకు రానిచ్చే వారు కాదు. జాతి వివక్ష తీవ్రంగా ఉండేది. న్యాయవాదిగా చేస్తూనే బ్రిటిష్ వారి నిరంకుశ చట్టాలపై పోరాడారు. 1894లో భారతీయుల ఓటు హక్కును కాలరాసే బిల్లును గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడే సత్యాగ్రహం అనే పోరాట విధానానికి నాంది పలికారు.
Must Read ;- ఉ. 11.00 గంటలు : మహాత్ముడి కోసం మౌనం పాటిద్దాం
భగవద్గీతే ఆయనకు దిక్కూచి
భగవద్గీత, గీతాపఠనం వల్ల గాంధీజీకి నిష్కామ కర్మ విధానం వంటబట్టాయి. 1914లో భారత్ తిరిగి వచ్చిన గాంధీ జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ తరవాత కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1918లో నీలిమందు పంటను వ్యతిరేకిస్తూ గాంధీ చంపారణ్, ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించారు. గాంధీ చేపట్టిన ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో బ్రిటిష్ వారు దిగివచ్చారు. నీలిమందు పంటకు మంచి ధర ఇచ్చి కొనుగోలు చేసేందుకు, పన్నులు తగ్గించేందుకు బ్రిటిష్ వారు అంగీకరించారు. అప్పటి నుంచి రైతులు బాపు, మహాత్మా అని పిలవడం ప్రారంభించారు.
అహింసే ఆయన ఆయుధం
1919 రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ అహింసా మార్గంలో కొనసాగించిన సత్యాగ్రహం ఆ చట్టాలకు అడ్డుకట్ట వేసింది. హింసకు ప్రతిహింస అనేది గాంధీజీ దృష్టిలో దుర్మార్గం. 1919 ఏప్రిల్ 13న పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ లో నిరాయుధులైన భారతీయులపై బ్రిటిష్ వారు కాల్పులు జరిపి 400 మందిని బలిగొన్నారు. ఆ తరవాత అహింసావాదం సరైన మార్గం కాదని చాలా మంది నమ్మారు. కానీ గాంధీజీ మాత్రం అహింస అనే ఆయుధాన్ని వీడలేదు. తుదిశ్వాస విడిచేవరకూ ఆయన అహింసామార్గం వీడలేదు.
పదునైన ఆయుధాలు
అప్పటికే భారతదేశంలో విదేశీ వస్తువుల వల్ల కుటీర పరిశ్రమలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇది గమనించిన గాంధీ స్వదేశీ ఉద్యమం ప్రారంభించారు. విదేశీ వస్తువులను బహిష్కరించాలని గాంధీ ఇచ్చిన పిలుపుమేరకు లక్షలాది భారతీయులు విదేశీ వస్తువలను బహిరంగంగా కాల్చివేశారు. సహాయ నిరాకరణ బ్రిటిష్ వారిపై గాంధీ ప్రయోగించిన మరో ఆయుధం. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా అహ్మదాబాద్ నుంచి దండి వరకు 400 కిలోమీటర్లు మేర గాంధీ చేపట్టిన దండియాత్ర చరిత్రలో నిలిచిపోయింది.
బ్రిటిష్ వారి ఉక్కుచట్టాలను ఉల్లంఘించి ఉప్పుతయారు చేసి రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. క్విట్ ఇండియా ఉద్యమ పిలుపుతో ఇక భారతదేశానికి స్వాతంత్ర్యం తప్పక ఇవ్వాల్సిన పరిస్థితిని బ్రిటిష్ వారికి కల్పించారు. 1945 నుంచే భారత్ కు స్వాతంత్ర్యం ప్రకటించే ప్రక్రియను బ్రిటిష్ వారు ప్రారంభించారు. 1947లో భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదికే దేశంలో హిందూ, ముస్లింల అల్లర్లలో వేలాది మంది చనిపోవడంతో గాంధీ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
స్వాతంత్ర్యం వచ్చిన మరుసటి ఏడాది అంటే 1948 జనవరి 30న ముంబయిలో గాడ్సే జరిగిపిన కాల్పుల్లో గాంధీ కుప్పకూలిపోయారు. ఆయన కన్నుమూసి 73 సంవత్సాలు అయినా నేటికీ ఆయన సూచించిన అహింస, సత్యాగ్రహ మార్గం భారతదేశానికే కాదు ప్రపంచదేశాలకు దిక్చూచిగా నిలుస్తోంది. స్వాతంత్ర్యం అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం కల్పించడమే అని సగర్వంగా ప్రకటించిన మహోన్నతుడు గాంధీ, అంటరానితనం, మద్యపాన నిర్మూలన, నిరక్షరాస్యతను తొలగించడంపై ఆయన జరిపిన పోరాటం ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. అందుకే ఆయన మహాత్ముడు అయ్యారు. భావితరాలకు మార్గదర్శిగా నిలిచాడు.
Also Read ;- బాపూజీకి ప్రముఖులు నివాళులు..