(విజయవాడ నుంచి లియోన్యూస్ ప్రత్యేక ప్రతినిధి)
స్వాతంత్ర ఉద్యమంలో, దేశంలో అక్షరాస్యతను పెంచడంతో, పీడిత వర్గాలకు అండగా నిలవడంతో వార్తా పత్రికలు పోషించిన పాత్ర ఎనలేనిది. అధికారంలో ఉన్న వారి ఒత్తిడికి లోను కాకుండా, ఎవరి ఇష్టాయిష్టాలకు సంబంధం లేకుండా మీడియా అత్యున్నత ప్రమాణాలు పాటించేలా చూసేందుకు 1956 లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్సుల మేరకు 1966 నవంబరు 16న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఏటా నవంబరు 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
అనేక దేశాల్లో ప్రెస్ కౌన్సిళ్లు ఉన్నా మనదేశంలోని ప్రెస్ కౌన్సిల్‌కు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ప్రభుత్వ శాఖలపై కూడా ప్రెస్ కౌన్సిల్ అధికారాన్ని వినియోగించుకోవచ్చు. పత్రికారంగానికి ఎదురయ్యే అనేక సవాళ్లను ప్రెస్ కౌన్సిల్ పరిష్కరిస్తుంది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19వ ఆర్టికల్ ప్రకారం పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, వారికి పత్రికా స్వేచ్ఛను గుర్తు చేస్తూ ఐక్యరాజ్యసమితి మే 3వ తేదీని అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛాదినంగా ప్రకటించింది.
ప్రజా సేవలో పత్రికలు
240 సంవత్సరాల కిందట అంటే 1780లోనే మనదేశంలో వార్తాపత్రికల ప్రచురణ ప్రారంభమైంది. బ్రిటీష్ వారి ఆధ్వర్యంలో మొదటిసారిగా 1780 జనవరిలో హకీస్ బెంగాల్ గెజిట్ అనే పత్రిక విడుదలైంది. అయితే భారతీయులు పత్రికారంగంలోకి అడుగుపెట్టింది మాత్రం 1851సంవత్సరంలోనే. దాదాభాయ్ నౌరోజీ రాజకీయ భావాలను ప్రచారం చేసేందుకు ‘ది ఇండియన్ ఎకనమిస్ట్’ అనే పత్రికను నడిపారు. భారతదేశం నుంచి బ్రిటిష్ వారు ఎలా సంపదను దోచుకుంటున్నారో దాదాభాయ్ పత్రిక ద్వారా విరుచుకుపడ్డారు. దీంతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు మొదలైంది. దీంతో 1878 లో బ్రిటిష్ వారు సెన్సార్ చట్టాన్ని తెచ్చారు. పత్రికల్లో ప్రచురించే వార్తలను సెన్సార్ చేసేవారు. ఇక 1882 లో ఎఫ్.సి. మెహతా కైసర్ ఎ హింద్ పత్రిక ప్రారంభించారు. సంఘ సంస్కర్త రాజారామ్ మోహన రాయ్ తత్వబోధిని అనే పత్రిక ప్రారంభించి మూడాఛారాలపై సమరం చేశారు.
సతీసహగమన దురాచారాన్ని రూపుమాపేందుకు ఆయన పత్రిక ద్వారా చేసిన సేవలు మరువలేనివి. స్వాతంత్ర్యం వచ్చే నాటికే మన దేశంలో 12 జాతీయ ఆంగ్ల దినపత్రికలు నడిచాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా, పయనీర్, స్టేట్స్ మన్ పత్రికలను బ్రిటిష్ వారే నడిపారు. చెన్నైలో ది హిందూ, బొంబాయిలో ది ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఢిల్లీలో హిందూస్తాన్ టైమ్స్, కలకత్తాలో అమృత్ బజార్ పత్రికలు విజయవంతంగా నడిచాయి.
Also Read:-ఇండియా యుద్ధం చేస్తుందని గజగజ వణికిపోయారు
తెలుగు పత్రికల కృషిని మరవలేం
తెలుగులో ఆంధ్రపత్రిక, కృష్ణా పత్రిక ప్రజలకు విశేషంగా ప్రభావితం చేశాయి. మచిలీపట్నం కేంద్రంగా ఎం.కృష్ణారావు నేతృత్వంలో నడిచిన కృష్ణా పత్రిక స్వాతంత్ర్య ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచింది. ఇక ఎనిమిది దశాబ్దాల కిందట నెల్లూరు కేంద్రంగా స్థాపించిన జమీన్ రైతు నేటికీ వెలువడుతూ పాఠకుల ఆదరణ చూరగొంటోంది. ఇక తెలుగులో ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఉదయం, వార్త, సాక్షి, ప్రజాశక్తి, విశాలాంధ్ర పత్రికలు ప్రజలను చైతన్యం చేయడంలో విశేషంగా కృషి చేశాయి. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని పత్రికలు కొన్ని పార్టీలకు కరపత్రాలుగా మారాయనే అపవాదును కూడా మూటగట్టుకున్నాయి.
పత్రికలు అందించే సమాచారం
పత్రికలు అందించే సమాచారం సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. స్వాతంత్రం రావడానికి పూర్వం బ్రిటిష్ వారు దేశాన్ని ఎలా దోచుకుంటున్నారు, జమీందారులు, దొరల అరాచకాలపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు పత్రికలు విశేషంగా కృషి చేశాయి. విశాల భారతంలో సతీసహగమనం, బాల్యవివాహాలు, నిరక్షరాస్యత, పేదరికం రూపుమాపేందుకు వార్తా పత్రికలు ఎప్పటికప్పుడు ప్రజలను జాగరూకులను చేస్తూ సమాజంలో మంచి మార్పుకు దోహదం చేశాయి.
Also Read:-https://www.theleonews.com/book-lover-ankegowda/
పత్రికలు ఎదుర్కొంటున్న సవాళ్లు
నేడు పత్రికారంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలతో పత్రికలకు గడ్డుకాలం దాపురించింది. దీనికి తోడు కరోనా వైరస్ కూడా వార్తాపత్రికల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపింది. కరోనా వైరస్ ముందు దేశ వ్యాప్తంగా 12 కోట్ల పత్రికల అమ్మకాలు ఉండగా నేడు 6 కోట్లకు పడిపోయాయని తెలుస్తోంది. అంటే గడచిన ఏడు నెలల కాలంలోనే పత్రికల అమ్మకాలు సగానికి పడిపోయాయన్న మాట. పత్రికల అమ్మకాలు, ప్రకటనలు తగ్గిపోవడంతో పత్రికారంగం ఎన్నడూ లేని సంక్షోభంలో చిక్కుకుంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో పత్రికారంగం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఏది ఏమైనా వార్తాపత్రికలు లేని సమాజాన్ని ఊహించుకోవడం కొంచెం కష్టమేనని చెప్పాలి.
Also Read:-కరోనా గిరోనా జాన్తానై అంటున్న రష్మిక?