(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో గల కోమనపల్లి కాశీవిశ్వేశ్వర ఆలయం ఘటనలో ఒడిశాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ అమిత్‌బర్దార్ చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. హిరమండలం కొమనాపల్లి గ్రామ శివారులో కొందరు గుర్తుతెలియని రైస్ పుల్లింగ్ కాయిన్ నేరస్థులు కాశీవిశ్వేశ్వర ఆలయానికి చెందిన గాలి గోపురానికి రంధ్రం చేసి దొంగతనానికి పాల్పడ్డారన్నారు. అదే సమయంలో వారివద్దనున్న పురాతన నాణేలు పడిపోయాయని, ఈ ఘటనపై హిరమండలం పోలీసుస్టేషన్‌లో గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పాలకొండ డీఎస్పీ శ్రావణి పర్యవేక్షణలో ఎస్.ఐ. మధుసూదనరావు సిబ్బందితో ముమ్మరంగా దర్యాప్తు చేశారన్నారు. వాటి ఆధారంగా ఒడిశాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు. వారి వద్ద నుంచి 50 పురాతన నాణేలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు
అమాయక ప్రజలను మాయచేసి, మోసం చేయాలనే ఉద్దేశంతో పురాతన నాణేలను సేకరించి, మహిమ గల, శక్తివంతమైన నాణేలని ప్రజలను నమ్మబలికి ఎక్కువ ధరకు అమ్మి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. కేసును ఛేదించిన ఎస్‌ఐ మధుసూదనరావు, కానిస్టేబుల్ ఎం.జోగారావు, హోంగార్డు బి.రమేష్‌కు నగదు పురస్కారాన్ని అందజేశారు. సమావేశంలో పాతపట్నం సీఐ రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Must Read ;- దుర్గగుడి వెండి సింహాల మాయం కేసులో కదలిక











