ఏపీలో మద్యం ధరల తగ్గింపు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కరోనా ప్రభావంతో 40 రోజులు వైన్ షాపులు మూతపడ్డాయి. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. కోల్పోయిన ఆదాయాన్ని రాబట్టుకునేందుకు మద్యం ధరలను ఒకేసారి 75 శాతం పెంచారు. దీనిపై ప్రతి పక్షాల నాయకులు, మద్యం ప్రియులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ప్రభుత్వ పెద్దలు ముందే సిద్దం చేసుకున్న పొలిటికల్ గేమ్ ప్లాన్‌ను ప్రజల ముందుకు తెచ్చారు. మద్య నిషేధంలో భాగంగా మద్యం వినియోగం గణనీయంగా తగ్గించేందుకే ధరలు పెంచామని భాష్యం చెప్పారు. వింత వాదన వినిపించారు. అధికారంలో ఉన్నారు కాబట్టి వారు ఏది చెప్పినా ప్రజా శ్రేయస్సుకే అని అంటారు. అందరూ వినాల్సిందే. ఈ అంశం అప్పుడు ముగిసినా, నేడు మరల ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించింది. ఇప్పుడేం చెబుతారో అని అందరూ ఆసక్తి చూస్తున్నారు. వైసీపీ పెద్దలు ఏమీ చెప్పక పోవచ్చు. లేదంటే ఇది కూడా ప్రజాశ్రేయస్సు కోసమేనని చెప్పవచ్చు. మద్యం ధరలు తగ్గించడం వల్ల పేదలు వారు సంపాదించిన మొత్తంలో ఎక్కువ మొత్తం ఇంటికి తీసుకెళ్లడానికి అవకాశం దొరుకుతుందని అనవచ్చు. లేదంటే అక్రమ మద్యం, నాటు సారాలను అరికట్టేందుకే ధరలను తగ్గించామని కూడా చెప్పవచ్చు.
ఎందుకు పెంచారు? ఎందుకు తగ్గించారు?
ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు మద్యం ధరలు పెంచారని అందరికీ తెలిసిందే. ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని అంగీకరించదు. ఇక ధరలు తగ్గించింది కూడా ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకే. ఇదేంటి మద్యం ధర తగ్గిస్తే ఆదాయం ఎలా పెరుగుతుందనే అనుమానం కొందరికి రావచ్చు. మద్యం ధరలు విపరీతంగా పెంచడంతో పొరుగు రాష్ట్రాల నుంచి బ్రాండెడ్, చౌక మద్యం రాష్ట్రంలోకి విచ్చలవిడిగా వచ్చిపడుతోంది. దీంతో ఆరు మాసాల కాలంలోనే ఏపీ ప్రభుత్వం రూ.3,600 కోట్ల ఆదాయం కోల్పోయింది. ధరలు పెంచితే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని భావించిన పెద్దలకు దిమ్మ తిరిగింది. అందుకే మద్యం ధరలు భారీగా తగ్గించారు. ఇంకా తగ్గించే అవకాశం కూడా ఉందంటున్నారు. మద్యం ధరలు తగ్గించినా వినియోగం పెరుగుతుందని ఆశించలేం. ఎందుకంటే ఏపీలో ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యం బ్రాండ్లు ప్రపంచంలో ఎక్కడా ఉండవు. లోకల్ మేడ్ మద్యానికి అంతర్జాతీయ పేర్లు పెట్టి అమ్ముతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం తగ్గించిన తరవాత కూడా పొరుగు రాష్టాల నుంచి బ్రాండెడ్ మద్యం దిగుమతి అవుతూనే ఉండటం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తాజాగా జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్ పోస్టు వద్ద తెలంగాణ నుంచి ఏపీకి మద్యం తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి భారీగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో మద్యం ధరలు తగ్గించినా, మద్యం ప్రియులకు కావాల్సిన బ్రాండ్లు లేవంటున్నారు
పేరున్న బ్రాండ్లు, పొరుగు రాష్ట్రాల ధరలే దిక్కు
మన దేశంలో రాష్ట్రాల మధ్య సరిహద్దులంటే పెద్దగా తనిఖీలు ఉండవు. ఏదో ఒక చెక్ పోస్టు మాత్రమే ఉంటుంది. దీనికితోడు ఏపీకి 900 కిలోమీటర్లకుపైగా తెలంగాణతో సరిహద్దు ఉంది. దీంతో ఏదో ఒక ప్రాంతం నుంచి బ్రాండెడ్ మద్యం అక్రమంగా దిగుమతి అవుతూనే ఉంది. అక్రమ మద్యం దిగుమతి కాకుండా పోలీసులు, అబ్కారీ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికే 1200 కేసులు నమోదు చేసినా, అక్రమ మద్యం రవాణా మాత్రం నిలిచి పోలేదు.
పరిష్కారం లేదా?
ఉంది. అక్రమ మద్యం అడ్డుకోవాలంటే పేరున్న అన్నీ బ్రాండ్లను తెలంగాణలో ఉన్న ధరలకే ఏపీలోనూ అందుబాటులో ఉంచాలి. అప్పుడు అక్రమ మద్యం ఎవరూ తీసుకువచ్చే సాహసం చేయరు. ఎందుకంటే తెలంగాణలో రేటుకే ఏపీలో అవే కంపెనీల మద్యం దొరుకుతున్నప్పుడు ఇంకెవరు అక్కడ నుంచి మోసుకొచ్చుకుంటారు చెప్పండి. అందుకే ప్రభుత్వ ఆదాయం పెరగాలంటే అదొక్కటే మార్గం