మాజీ ఎంపీ, విజయసాయి రెడ్డికి బిగ్‌షాక్ తగిలింది. ఆయన కుమార్తె నేహా రెడ్డి, అల్లుడు రోహిత్ రెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్న టైంలో భీమిలి సముద్ర తీరంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఈ కేసులు నమోదయ్యాయి. పర్యావరణ చట్టం నిబంధనలు ఉల్లంఘించారని ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
భీమిలి బీచ్ దగ్గర CRZ నిబంధనలు ఉల్లంఘించి విజయసాయిరెడ్డి కూతురు నేహా రెడ్డి ప్రహారి గోడ నిర్మాణాన్ని చేపట్టారు. దీనిపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గతంలోనే హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు. బీచ్‌లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించవద్దని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నేహా రెడ్డికి 2024 సెప్టెంబర్‌లో GVMC నోటీసులు జారీ చేసింది. తర్వాత అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది.
తాజాగా ఈ అంశానికి సంబంధించి నేహా రెడ్డి, ఆమె భర్త రోహిత్ రెడ్డిలపై కేసు నమోదైంది. నిజానికి కేసులు పెట్టడం చాలా ఆలస్యం అయింది. హైకోర్టు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసిన తర్వాతనే కేసు నమోదు చేశారు. ఆ విషయం కూడా రహస్యంగా ఉంచారు. ఈ నెల పదో తేదీన కేసు నమోదు చేస్తే తాజాగా వెలుగులోకి వచ్చింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు విజయసాయి రెడ్డి. ఆ టైంలో ఉత్తరాంధ్రలో ఆయన చెప్పిందే వేదం. దీంతో ఆయన అక్రమాలకు అడ్డు లేకుండాపోయింది. ఆయన కుమార్తె పేరుతో భీమిలీ బీచ్‌ను చాప చుట్టేయాలనుకున్నారు. పెద్ద ఎత్తున రిసార్టులు, హోటళ్లు కట్టేందుకు బీచ్ ను కబ్జా చేసి..చాలా లోతుకు తవ్వి పునాదులు కూడా వేశారు. కనీసం కిలోమీటర్ మీర గోడ కట్టినట్లుగా గుర్తించారు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తదుపరి చర్యలు ఏం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. విజయసాయి రెడ్డి గతంలోనే వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలోనూ లేరు. ఐతే ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని కథనాలు వస్తున్నాయి.











