(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆర్. కె. బీచ్ వద్ద గల స్వర్గీయ యన్. టి. రామారావు విగ్రహం నుంచి బయలుదేరి ఊడా పార్కు వద్ద గల స్వర్గీయ వై. యస్. రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు ఆదివారం బీచ్ వాక్ నిర్వహించారు. అనంతరం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ జె. అయోధ్య రామ్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉన్న జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా gvmc డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ మాట్లాడుతూ ఈ నెల 9న జరిగే సమావేశంలో “విశాఖ ఉక్కు రక్షణ” కై ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామని అన్నారు. జాతీయ intuc ప్రధాన కార్యదర్శి సంజయ్ సింగ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగాన్ని మోదీ అమ్ముతున్నారు, దీనికి వ్యతిరేకంగా కార్మికవర్గం, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ప్రధానంగా రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను వదలి ఒకే ఎజెండాతో ఉద్యమానికి మద్దతు పలికి ఢిల్లీలో ఒకే గళాన్ని వినిపించాలని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.78వ వార్డు కార్పోరేటర్ బి. గంగారాం మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ నగరానికే తలమానికమని ఆయన అన్నారు. దీన్ని కాపాడుకోవడానికి సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆమ్ఆద్మి పార్టీ విశాఖ ఇన్‌చార్జి సీతల్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఉద్యమాన్ని తమ నాయకత్వానికి ప్రతిరోజూ పంపుతున్నామని, తద్వారా పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని ఆమె తెలిపారు. అలాగే రానున్న కాలంలో జరిగే ఉద్యమంలో భాగస్వామ్యం అవుతామని ఆమె అన్నారు.
సైకిల్ యాత్ర చేస్తున్న గడ్డం రాము మాట్లాడుతూ ఈ ఉద్యమాన్ని గ్రామ గ్రామానికి తీసుకువెళ్లాలని కోరారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్, డి. ఆదినారాయణ, కో కన్వీనర్స్ గంధం వెంకట్రావు, కె. యస్. యన్. రావు, సభ్యులు వై. టి. దాస్, యన్. రామారావు, వై. మస్తనప్ప,దొమ్మెటి అప్పారావు, బొడ్డు పైడిరాజు, విళ్ళ రామ్మోహన్ కుమార్, కొమ్మినేని శ్రీనివాస్, కామేషు, వరసాల శ్రీనివాస్ తదితరులు ప్రసంగిస్తూ ప్లాంట్‌ని కాపాడుకోవడానికి ఎంతటి త్యాగాలకైనా వెనుకాడమని స్పష్టం చేశారు.
Must Read ;- ఉక్కు నిర్వాసితుల ఛలో కలెక్టరేట్..










