(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కు తగ్గక పోవడంతో ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో ఉన్న ఉద్యమాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకే ట్రేడ్ యూనియన్లు సమర శంఖం పూరించాయి. అందులో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ స్థాయి ట్రేడ్ యూనియన్ నాయకులతో శనివారం త్రిష్ణ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. కనీసం లక్ష మంది హాజరవుతారని కార్మిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయి నాయకుల సారథ్యంలో ముందుకు తీసుకెళ్తామని విశాఖ ఉక్కు పోరాట కమిటీ అధ్యక్షుడు సిహెచ్ నరసింగరావు తెలిపారు.
నేడు హేమాహేమీలు హాజరు..
జాతీయ స్థాయి ట్రేడ్ యూనియన్ నాయకులు జి సంజీవరెడ్డి(INTUC), తపన్ సేన్(CITU), అమర్జీత్ కౌర్(AITUC), రియాజ్ అహ్మద్(HMS), డి కే ఫాంతే (BMS), పి గౌతమ్ రెడ్డి(YSRTUC), G. రఘురామ రాజు(TNTUC) తదితరులు ప్రసంగించనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పార్లమెంట్లో చెప్పిన కారణాలు VSPకి వర్తించవని ఇప్పటికీ రాష్ట్ర స్థాయి నాయకులు స్పష్టం చేశారు. సొంత గనులు కేటాయించక పోయినా విస్తరణ చేపట్టిన ఘనత స్టీల్ ప్లాంట్‌కు దక్కుతుందని అన్నారు. ఐఎన్‌టియుసి ఆలిండియా సెక్రెటరీ మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాల వల్ల వడ్డీల భారం వల్ల నష్టాలు పెరిగాయి తప్ప మరో కారణం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని వారంతా స్పష్టం చేశారు.
26న భారత్ బంద్
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే రాష్ట్ర బంద్ నిర్వహించిన కార్మిక సంఘాలు మార్చి 26న నిర్వహించే భారత్ బంద్‌లో ప్రజలందరూ స్వచ్చందంగా పాల్గొనాలని వామపక్ష నేతలు కోరుతున్నారు. దేశంలో ప్రజలందరూ బీజేపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతున్నారని, రైతులు గత నాలుగు నెలలుగా ఢిల్లీలో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పోరాడుతున్నారన్నారు. కార్మికులు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని అనేక సమ్మెలు చేస్తున్నారని, సాధారణ ప్రజలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని నిత్యావసర సరుకుల ధరలు అదుపు లోకి తేవాలని అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. వీటికి కొనసాగింపుగానే మార్చి 26 న జరిగే భారత్ బంద్ ను దేశ ప్రజలందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బహిరంగ సభలు, ర్యాలీలు ప్రతి రెండు మూడు రోజులకు ఉండేలా ప్రణాళిక రచించారు.
ఉక్కు ఉద్యమంలో జర్నలిస్టుల భాగస్వామ్యం
విశాఖ ఉక్కు పరిరక్షణలో జర్నలిస్టులు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన మేధావులు, సీనియర్ జర్నలిస్టులతో ఆంధ్ర యూనివర్సిటీ టి ఎల్ ఎన్ సభా హాలులో ప్రత్యేక సదస్సు జరగనుంది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు చెందిన జర్నలిస్టులు హాజరయ్యే ఈ సదస్సు ద్వారా ఉక్కు పరిరక్షణకు మరింత ఉద్యమ స్ఫూర్తి లభించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సీనియర్ నాయకులు ఆలపాటి రవి, అంబటి ఆంజనేయులు తదితరులు పాల్గొంటారని ఏపీయూడబ్ల్యూజే విశాఖ నగర అధ్యక్షులు రావులవలస రామచంద్ర రావు తెలిపారు.
Must Read ;- మా భూములు మాకివ్వండి.. విశాఖ స్టీల్ భూ నిర్వాసితుల ర్యాలీ