ఎన్నిసార్లు పడి లేచినా.. ఎన్నిసార్లు సైడు మార్చినా.. ఏ వాదం ఎత్తుకున్నా.. ఆయన క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయాడు. అయినా నేడు సీఎం అభ్యర్ధిగా ప్రకటించగానే.. ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఆయన రోడ్డు మీదకు రాగానే జనం వచ్చేస్తారు.. ఆయన ఆవేశంగా పంచ్‌లు కొట్టగానే జనం ఊగిపోతారు. మరి ఓట్లు వేస్తారా, వేయరా అంటే.. అది మాత్రం చెప్పలేం. కాని పవన్ కల్యాణ్ గ్రాఫ్ మాత్రం ఎన్నిసార్లు పడిపోయినా.. లేచిన ప్రతిసారీ గట్టిగా ఎగసిపడుతోంది. అదే రాజకీయ పండితులను ఆశ్చర్యంలో పడేస్తోంది.
వార్ అంతా వైసీపీ, జనసేన మధ్య అన్నట్లుగా..
తిరుపతిలో పవన్ కల్యాణ్ ఎంట్రీ ఒక్కసారిగా రాజకీయ వాతావరణాన్ని మార్చేసింది. పవన్ వైసీపీ టార్గెట్‌గా విసిరిన పంచ్‌లు.. ఆ తర్వాతి రోజు మంత్రి పేర్ని నాని, కొడాలి నానిలు పవన్‌పై విరుచుకుపడటంతో.. అసలు తెలుగుదేశం పోటీలో లేదా.. బీజేపీ పోటీలో ఉందా లేదా.. వార్ అంతా వైసీపీ, జనసేన మధ్య అన్నట్లుగా మారిపోయింది. పవన్ కల్యాణ్ సభకు జనం భారీగా రావడం.. ఆయన పంచ్‌లు బాగా పేలడంతో.. బీజేపీలో హషారొచ్చేసింది. ఇప్పటి వరకు అనాథలా ఏంటి మన పరిస్ధితి అనుకున్న కమలనాథులకు ఉత్సాహం వచ్చింది. అయితే ఒక్క సభతో ఊపు వచ్చేస్తుందా అంటే డౌటే. కాకపోతే ఒక విషయంలో కమలనాథులు సక్సెస్ అయ్యారు. అదేంటంటే.. పవన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అధికారికంగా ప్రకటించడంతో.. జన సైనికులు ఓట్లు జారిపోకుండా.. పడేలా చేసుకున్నారు.

ఆ రెండిటి ఊసెత్తకుండా..
కాకపోతే సమస్య ఏంటంటే.. పవన్ కల్యాణ్ వైసీపీని గట్టిగా ప్రశ్నించినా.. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్న బీజేపీని ఏమీ అనలేదు. బీజేపీ అభ్యర్ధి తరపున ప్రచారానికొచ్చి వారినెలా అంటారని అడుగుతారు కొందరు. కాని కనీసం ఆ రెండు అంశాలలో తాము బీజేపీతో విబేధిస్తున్నామనో.. లేక మోదీని, అమిత్ షాను అడిగాం.. ఒత్తిడి చేస్తామనో.. లేదా ఆ రెండు చేయకపోతే భవిష్యత్‌లో దూరం జరగాల్సి వస్తుందనో.. అలాంటి డైలాగులు వేసినా.. సూపర్‌గా ఉండేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలా కాకుండా అవేమీ ప్రస్తావించకుండా ఎంత అరిచినా.. ఆవేశపడినా.. నిజాయితీ కనిపించదనే వాదన వినిపిస్తోంది.
రాజకీయ విధానంలో క్లారిటీగా ఉంటే..
కాని ఒక్కటైతే నిజం. పవన్ గ్రాఫ్ బీజేపీ మాత్రం బాగా పెంచుతుంది. ఒకవైపు ఏపీలో సీఎం అభ్యర్ధిగా ప్రకటించడం.. మరోవైపు తెలంగాణలో బీజేపీ నేతలు ఆయనను కూల్ చేసే ప్రయత్నాల్లో పడటం.. ఇవన్నీ పవన్ కల్యాణ్ డిమాండ్‌ను పెంచాయి. పైగా మూడున్నరేళ్ల తర్వాత ఆయన సినిమా వకీల్ సాబ్ రిలీజ్ అవుతోంది. ఆ సినిమాకు బాగా హైప్ క్రియేట్ అయింది. ఆ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ సైతం పవన్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చూపించింది. ఇవన్నీ పవన్‌ను మళ్లీ స్టార్ గా చూపిస్తున్నాయి. మరి వీటన్నిటిని వాడుకుంటూ.. రాజకీయ విధానంలో క్లారిటీగా ఉంటే కెరీర్ గ్రాఫ్ కూడా పెరుగుతుంది. అలా కాకుండా కప్పదాట్లు వేస్తూ.. తడబాటు చూపిస్తూ.. వెళితే మాత్రం మళ్లీ పాత అనుభవాలే ఎదురవుతాయని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Must Read ;- గాజుగ్లాసుతో బీజేపీకి తలనొప్పులు.. గుర్తింపు లేదట











