పారిజాతం – ఎంత అందమైన పేరిది. ఓ పుష్పానికి ఇంత అందమైన పేరు ఉందంటే అది ఏ దేవలోకానికో చెందినది అయి ఉంటుంది అనిపిస్తోంది కదూ. నిజానికి అంతేనట. ఇది దివి నుంచి భువికి దిగివచ్చిన పుష్పరాజం అని మన పురాణాలు చెబుతున్నాయి.
ఈ భూప్రపంచంలో ఏ చెట్టుకూ లేని ప్రత్యేకత పారిజాతానికి ఉంది. అందుకేనేమో ‘పారిజాత సుమ దళాల పానుపూ.. మనకు పరిచినాడు చెరకు వింటి వేలుపూ’ ఆరుద్ర కూడా పాట రాశారు. పారిజాత చెట్టు ప్రస్తావన భాగవతంలో కనిపిస్తుంది. నారదుడు పారిజాత పుష్పాలను తీసుకొచ్చి రుక్మిణీ దేవికి అందిస్తాడు. దాంతో సత్యభామకు కోపం వస్తుంది.. ఆ పుష్పాన్ని నారదుడు తనకివ్వకుండా రుక్మిణికి ఇచ్చాడని ఆమె అలుగుతుంది. ఆమె కోపాన్ని తగ్గించడానికి ‘పారిజాత చెట్టునే నీ పెరట్లో నాటుతాను’ అని కృష్ణుడు హామీ ఇచ్చాడు.
అంతేకాదు దేవలోకం నుంచి ఈ చెట్టును తెచ్చి నాటాడని చెబుతారు. దీన్ని బట్టి మనకు తేలేది ఏమిటంటే ఈ చెట్టు దేవలోకానికి సంబంధించిందేకాని మనకు చెందినది కాదని. ఈ చెట్టుకు సంబంధించి పురాణాలలో ఇంకా చాలా కథలు ఉన్నాయి. మన పురాణాల ప్రకారం పాల సముద్రం నుంచి బయటకు వచ్చిన పవిత్రమైన వస్తువులలో పారిజాత చెట్టు కూడా ఒకటని చెబుతారు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు పాలసముద్రం నుంచి కామధేనువు, కల్పవృక్షం పుట్టాయని చెబుతుంటారు కదా. ఆ కల్పవృక్షమే ఈ పారిజాతం.
మరో కథనం ప్రకారం విష్ణుమూర్తి కోరిక మేరకు ఇంద్రుడు మానవజాతి ప్రయోజనాల కోసం ఈ పారిజాత వృక్షాన్ని ఈ భూమ్మీదకు పంపాడనేది మరో కథనం. పారిజాత చెట్టుతో సంబంధం ఉన్న మరో పురాణ కథ కూడా ఉంది. మహాభారతంలో పాండవులు తన తల్లి కుంతితో కలిసి అడవిలో నివాసముంటారు. ఆ సమయంలో శివుడిని ఆరాధించడానికి కుంతికి పారిజాతం పూలు దొరకలేదు. అప్పుడు అర్జునుడు ఇంద్రుడిని ఆరాధించి పారిజాత చెట్టును ఇవ్వమని కోరాడు. తన కొడుకు కోరిక మేరకు ఇంద్రుడు పారిజాత చెట్టును కూడా ఇచ్చాడు అంటారు.
ఇంత పవిత్రమైన ఈ వృక్షం యూపీలోని పరాబంకి సమీపంలోని కిందూర్ గ్రామంలో ఉంది. ఈ చెట్టుకు కాసే పువ్వులు ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయి. దీన్ని ఇంద్రుడు స్వర్గానికి తీసుకొచ్చినట్లు చాలా మంది నమ్ముతారు. నూతన దంపతులు ఈ చెట్టుకు దారం కట్టి ప్రార్థిస్తే వారు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కొత్త జంట పారిజాత పుష్పాలతో దేవుళ్లందరినీ పూజిస్తే ఎంతో మేలు జరుగుతుందని పండితులు చెబుతారు. ఈ పూల నుంచి మంచి సుగంధ తైలాన్ని తయారు చేస్తారు.
దీని ఆకుల రసాన్ని పిల్లలకు విరేచనకారిగానూ వాడతారు. పారిజాతం చెట్టు ఆకులు మన చేతికి ఉండే ఐదు వేళ్ల మాదిరిగా ఉంటాయి. దీనిపై భాగాన ఉండే ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. దీని ఆకులతో కాచిన కషాయాన్ని కీళ్ల నొప్పుల నివారణకు వాడతారు. నిఫా వైరస్ వంటి మహమ్మారిని నివారించేందుకు కూడా పారిజాతం చక్కగా ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కరోనా వైరస్ ను అరికట్టడానికి కూడా ఇదేమైన ఉపయోగపడుతుందేమో పరిశోధనలు జరిగితే మంచిది.
పారిజాతం ప్రత్యేకతలు ఎన్నెన్నో
ఈ భూమ్మీద పుష్పాలకు ఉండే ప్రయోజనమే వేరు. ముఖ్యంగా దేవతారాధనకు పూలనే ఎక్కువగా వినియోగిస్తుంటారు. మన దేశంలో ఉత్తర ప్రదేశ్ లో ఈ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరతాయని అక్కడి ప్రజల నమ్మకం. ఈ చెట్టు ఆకులు, కొమ్మలు రాలవు. చాలా బలంగా ఉంటాయి. పూలు మాత్రమే రాలతాయి. దీని వయసు వెయ్యి నుంచి ఐదు వేల సంవత్సరాలు ఉంటుందని అంటుంటారు. పారిజాతంలో 9 రకాలు ఉన్నాయి. ఎర్ర రంగుతో ఉండేదాన్ని ముద్ద పారిజాతం అంటారు. మరొకటి రేకుల పారిజాతం, తెల్లగా ఎర్రకాడతో చిన్నగా ఉంటుందిది. తెల్లారేసరికి చెట్టుకింద పూలు రాలి ఉంటాయి.
పసుపు పచ్చరంగులో ఉందేది ఇంకో రకం. నీలి రంగు, గన్నేరు రంగు, గులాబీ రంగు,తెలుపు రంగు.. ఇలా 9 రకాలుగా పారిజాత పుష్పాలు ఉంటాయి. ఎరుపు రంగు పారిజాతంతో విష్ణువును ఆరాధించకూడదు. ఎందుకంటే ఎరుపుది తమో గుణం కాబట్టి. విష్ణుమూర్తి సాత్వికుడు కాబట్టి ఎరుపు రంగు పారిజాతాలతో ఆయనను పూజించకూడదు. పారిజాత పుష్పాన్ని చెట్టు మీద నుంచి కోయకూడదు. కింద పడిన పూలను మాత్రమే వినియోగించాలి. మనది కర్మ భూమి. పూజ అనే కర్మ చేయాలంటే ఆ పూవు భూమిని తాకితేనే దానికి పూజకు అర్హత వస్తుంది.
ఈ భూమ్మీద చేసే యజ్ఞాలు, పూజలు మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి. అందుకే దేవతలు కూడా స్వర్గంలో కాకుండా భూమ్మీదకు వచ్చి యజ్ఞాలు చేస్తుంటారట. పూజాకర్మకు అర్హత పారిజాత పూవుకు రావాలి అంటే అది భూమిని తాకాల్సిందే. అందువల్ల పారిజాత పుష్పాన్ని కోసి పూజ చేయకూడదు. రాలి భూమ్మీద పడిన పూవును మాత్రమే ఫూజకు ఉపయోగించాలి. ‘నేనిస్తే తప్ప నా నుంచి ఎవరూ లాక్కో కూడదు.’ అని వృక్షం తపస్సు చేసి ఆ వరాన్ని పొందిందని చెబుతుంటారు.
సాధారణంగా కింద పడిన వేరే ఇతర పూవులను మనం వాడం. ఒక్క పారిజాతాన్ని మాత్రం కింద పడిన దాన్నే ఏరుకోవాలి, దాన్నే పూజకు ఉపయోగించాలి. పారిజాతం చెట్టు నుంచి పూలు రాలతాయని చెట్టుకింద ఏవేవో పరుస్తారు. అలా చేయకూడదు. కావాలంటే ఆ భూమిని శుద్ది చేయాలి తప్ప వేరేవి పరచకూడదు. భూమి స్పర్శ, మట్టి స్పర్శ, జల స్పర్శ, తర్వాత మన హస్త స్పర్శ పారిజాతానికి కావాలి. ఐదు స్పర్శలతో పారిజాతం పంచమహాపాతకాలను పోగొడుతుందని శాస్ర్తం చెబుతోంది.
– హేమసుందర్