కోట్లాది మంది ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ విషయంలో మరో ముందడుగు పడింది. భారత్ బయోటెక్ తీసుకొస్తున్న కోవ్యాక్సిన్ ట్రయల్స్ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపింది. కోవ్యాక్సిన్ రెండు ఫేస్‌ల క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో సక్సెస్ సాధించినట్లు వెల్లడించింది. ఈరోజు నుంచి మూడవ దశ ట్రయల్స్ దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నది. 25 కేంద్రాల్లో దాదాపు 26 వేల మంది వ్యాక్సిన్ ట్రయల్స్‌లో వాలంటీర్లు పాల్గొంటున్నట్లు తెలిపింది. 28 రోజుల పాటు 6 మైక్రో గ్రాముల ఇంజక్షన్‌లు రెండు డోస్‌లను వాలంటీర్లకు ఇచ్చి వ్యాక్సిన్ సామర్ధ్యాన్ని పరిశీలించనున్నారు. వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వాలంటీర్లపై కరోనా ప్రభావాన్ని సంవత్సరం పాటు పరిశీలించనున్నారు. 25 కేంద్రాల్లో మొత్తం 26 వేల మందిపై జరుగుతున్న ఫేస్ 3 క్లినికల్ ట్రయల్స్ వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం.
కరోనా ఉధృతి ఇంకా దేశంలో తగ్గనేలేదు. రోజుకీ వేల కేసులు కొత్తవి నమోదవుతునే ఉన్నాయి. ఇప్పటికే భారత్‌తోపాటు పలు దేశాలు కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. కొన్ని వ్యాక్సిన్‌లు సెకెండ్ ఫేస్ ట్రయల్స్‌లను జరుపుకుంటున్నాయి. ఈక్రమంలో భారత్ బయోటెక్ తీసుకువస్తున్న కోవ్యాక్సిన్ రెండు దశల ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని మూడవ క్లినికల్ ట్రయల్స్ ఈ రోజు నుంచి ప్రారంభించడం శుభపరిణామమని అంటున్నారు. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నదనే ఆశాభావంను వ్యక్తం చేస్తున్నారు.
Also Read ;- కరోనాకు మందు మనలోనే ఉంది!