టోక్యో ఒలింపిక్స్ లో భారత్ సత్తాను చాటుతోంది. ఇప్పటికే రెండు స్వర్ణాలు, మూడు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరగా.. శనివారం నాడు ఏకంగా స్వర్ణ పతకం దక్కగా.. మరో కాంస్య పతకం కూడా దక్కింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన నీరజ్ చోప్రాం.. జావెలిన్ త్రోలో సత్తా చాటాడు. ఫైనల్స్ కు అర్హత సాధించిన చోప్రా.. అత్యుత్తమ ప్రదర్శనను కనబరచి 87.58 మీటర్ల రికార్డును సాధించాడు. దీంతో అతడికి స్వర్ణ పతకం లభించింది. ఇదిలా ఉంటే రెజ్లింగ్ లో సెమీస్ లో నిరాశపరచిన భజరంగ్ పూనియా.. కాంస్యం కోసం సాగిన పోరులో సత్తా చాటాడు. అతడికి కాంస్యం లభించింది. వెరసి భారత్ ఖాతాలో ఇప్పటిదాకా ఓ స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు చేరాయి.
ఆధ్లెటిక్స్ లో భారత్‌కు తొలి స్వర్ణం
హరియాణాలోని పానిపట్ కు చెందిన నీరజ్ చోప్రా… ప్రస్తుతం ఆర్మీలో సుబేదార్ గా పనిచేస్తున్నారు. జావెలిన్ త్రోలో సత్తా చాటుతున్న చోప్రా.. 2018 కామన్వెల్త్, ఆసియా క్రీడల్లోనూ స్వర్ణ పతకాలు సాధించాడు. అదే రీతిలో తన సత్తాను చాటుతూ తన త్రోకు పదును పెడుతూ వచ్చిన చోప్రా.. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు స్వర్ణం దక్కలేదన్న వెలితిని తీర్చాడు. వందేళ్ల ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు ఇప్పటిదాకా ఆథ్లెటిక్స్ లో స్వర్ణ పతకమే దక్కలేదు. ఆ లోటును ఇప్పుడు చోప్రా పూరించాడనే చెప్పాలి. ఇక ఒలింపిక్స్ లో చోప్రా సాధించిన స్వర్ణ పతకం భారత్ కు ఒలింపిక్స్ లో దక్కిన రెండో స్వర్ణంగా చెప్పాలి. 2008 ఒలింపిక్స్ లో షూటింగ్ లో అభినవ్ బింద్రా భారత్ కు తొలి స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టాడు.
పూనియాకు కాంస్యం
ఇక రెజ్లింగ్ లో తనదైన శైలి సత్తా చాటుతూ వచ్చిన భజరంగ్ పూనియా సెమీస్ లో నిరాశ పరిచాడు. ఇప్పటికే ఇదే ఈవెంట్ లో మరో విభాగంలో ఫైనల్ చేరిన భారత రెజ్లర్ రవికుమార్ దహియా.. స్వర్ణ పతక పోరులో నిరాశపరిచాడు. అయితే అతడికి రజత పతకం దక్కింది. దహియా మాదిరే భారత్ రెజ్లింగ్ లో స్వర్ణ పతక ఆశలు కల్పించిన భజరంగ్ పూనియా.. సెమీస్ లోనే ఓడిపోయాడు. దీంతో కాంస్యం కోసం శనివారం జరిగిన పోరులో అతడు విజయం సాధించి కాంస్య పతకాన్ని నెగ్గారు. ఒకే రోజు ఓ స్వర్ణం, ఓ కాంస్యం పతకాలతో టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటిదాకా 7 పతకాలు సాధించినట్టైంది.