ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..అర్ధంగాని పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ నెట్టబడిందా..? పోలీసులకు, అసాంఘిక శక్తులకు మధ్య లైన్ చెరిగిపోయిందా..? పోలీసుల ముసుగులో రౌడీ షీటర్లే చెలరేగిపోతున్నారా..? అనిపిస్తోంది.
ప్రతిపక్ష నాయకుల సభలు, సమావేశాలు, పాదయాత్రలలో, ప్రజా సమస్యలపై జరిగే ఆందోళనల సమయాల్లో పోలీసు బందోబస్తు చూస్తుంటే ఈ అనుమానం పెనుభూతమైంది.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ ఏర్పడి ఇప్పటికి 67ఏళ్లు..2014 రాష్ట్ర విభజన తర్వాత ఏపి పోలీస్ సర్వీస్, తెలంగాణ పోలీస్ సర్వీస్ గా విడివడినా తొలి 5ఏళ్లలో ఎటువంటి బ్లాక్ మార్క్ రాలేదు. సమర్ధ పోలీసింగ్ కు ఏపి కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. అలాంటిది 2019లో ఏపిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఏపి పోలీస్ పూర్తిగా అప్రదిష్టపాలైంది.
జగన్ రెడ్డి పాలనలో పర్వర్టెడ్, సైకో, రౌడీ రాజ్యంగా ఏపి మారింది. రౌడీ షీటర్లు, పోలీసులు చెట్టపట్టాల్ వేసుకోవడం ఏపిలో గత 4ఏళ్లుగా జరుగుతున్నదే..
పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ల పుట్టిన రోజులు చేయడం, స్టేషన్ హౌస్ ఆఫీసర్లే సదరు రౌడీ షీటర్ల తో కేక్ కోయించి, తినిపించడం తెలిసిందే..కట్ చేస్తే ఆ రౌడీ షీటర్లే ఎమ్మెల్యేలు, మున్సిపల్ ఛైర్మన్లు కావడం కొసమెరుపు.
పోలీసు చేయాల్సిన పనులను అసాంఘిక శక్తులే చేయడం, అసాంఘిక శక్తులు చేసే పనులను పోలీసులూ చేయడం ఏపిలోనే చూస్తున్నాం..
అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు మార్గదర్శకాలు ఉన్నట్లే పోలీసులకు ఒక మాన్యువల్ ఉంటుంది, డ్రస్ కోడ్ ఉంటుంది..
పోలీస్ శాఖలో యూనిఫామ్ ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఆఫీసర్..హోంగార్డు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇనస్పెక్టర్, సర్కిల్ ఇనస్పెక్టర్, డిఎస్పీ, ఎస్పీ, ఐజి, డిఐజి నుంచి డిజిపి వరకు అందరూ పోలీస్ మాన్యువల్ ను, డ్రస్ కోడ్ ను పాటించాల్సిందే..
డ్రస్ కోడ్ అంటే టోపీ, షర్ట్, ప్యాంట్, బెల్ట్, స్టార్స్, నేమ్ ప్లేట్,
విజిల్ కార్డ్(బ్లూ ఫర్ గెజిటెడ్ ఆఫీసర్లు, రెడ్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్లు) ఉంటాయి.
చేతిలో బ్యాటన్(లాఠీ) విధిగా ఉండాలి. వీటిలో ఏది లేకున్నా, ఏది మరిచిపోయినా చాలా షేమ్ గా ఉండేది. సీనియర్ల అక్షింతలు తెలిసిందే..
(ఇంటలిజెన్స్, సిఐడి, ఏసిబి వాళ్లు మాత్రం మఫ్టీలో ఉంటారు).
కానీ ఏపిలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆందోళన కల్గుతోంది. శాంతిభద్రతలను కాపాడాల్సిన వ్యవస్థలోకి అసాంఘిక శక్తులు చేరడం తీవ్ర ఆందోళనకర పరిణామం.
నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో, పవన్ కళ్యాణ్ విశాఖ, మంగళగిరి పర్యటనల్లో, చంద్రబాబు కుప్పం పర్యటనలో బందోబస్తులో పోలీసులతో పాటు వైసిపి కార్యకర్తలు కూడా ఖాకీ యూనిఫామ్ తో పాల్గొన్నారనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఆయా సమయాల్లో జరిగిన లాఠీఛార్జీలపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. పోలీసు ముసుగులో అసాంఘిక శక్తులే లాఠీలతో కొట్టడాన్ని మీడియా కూడా హైలెట్ చేసింది.
నేమ్ ప్లేట్ లేని వ్యక్తులు ఖాకీ యూనిఫామ్ తో తిరగడం, బ్లూ రంగు టోపీలతో కొందరు తిరగడం, వారి ముఖాలను చూస్తేనే రౌడీ షీటర్లుగా అగుపించడం పోలీస్ వ్యవస్థ ఉనికినే పెను ప్రమాదంలోకి నెడుతోంది.
మాజీ ఎంపితో సహా అనేకమంది ప్రతిపక్ష నాయకుల పట్ల, సోషల్ మీడియా కార్యకర్తల పట్ల, అమరావతి మహిళల పట్ల పోలీసుల ముసుగులో ఈ అసాంఘిక శక్తులే అరాచకాలకు పాల్పడ్డారనే అనుమానాలు అప్పట్లోనే వినిపించాయి. అమరావతి ఉద్యమంలో బాలింత మహిళ పొట్టలో బూటుకాలుతో తొక్కడం, ప్రజాందోళనల సందర్భంగా సామాన్యజనంపై విచక్షణారహితంగా లాఠీలతో కొట్టడం, గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారణ పేరుతో హింసించడం, వంటివన్నీ ఈ అనుమానాలకు ఊతమిచ్చేవే..
ఏపి పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చగా ఇది పరిణమించకముందే అధికారయంత్రాంగం మేల్కోవాలి. యావత్ సమాజాన్నే కబళించే ఈ ప్రమాదకర పోకడలను మొగ్గలోనే అణిచేయాలి.