ముందు నుంచీ టాలీవుడ్ కు కొన్ని కథాంశాలు అచ్చిరావు. అలాంటి వాటిలో దేవాలయాల కాన్సెప్ట్ ఒకటి. ఇప్పటివరకూ గుళ్ళూ, వాటిలోని అవినీతి, అక్రమాలపై కథని నడిపిన సినిమాలేవీ అంతగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. అలాంటి సెన్సిటివ్ కథాంశాలు ఎంచుకుంటే.. వాటిని ఎంతో జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం దర్శకులకు ఎంతైనా ఉంది. టాలీవుడ్ లో వరుసగా అభ్యుదయ చిత్రాలు తీసి మంచి పేరు తెచ్చుకున్న ఒకప్పటి దర్శకుడు టి. కృష్ణ కూడా ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు.
శోభన్ బాబుతో ఆయన తీసిన ‘దేవాలయం’ సినిమా గుళ్ళలోని అర్చకత్వం .. వాటి వెనుక ఉన్న అవినీతి శక్తుల మీద తెరకెక్కింది. ఇందులో రావుగోపాలరావు, జేవి సోమయాజులు లాంటి అగ్రశ్రేణి నటులు అభినయించినా.. ఎందుకోగానీ అప్పటి ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. రాజశేఖర్, రోజా జంటగా.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘రథయాత్ర’ సినిమా కూడా పరాజయం పాలైంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాల వ్యవహారాల్లో రాజకీయ నాయకులు తలదూర్చి… అక్రమాలు సాగిస్తే.. పరిస్థితి ఎంత అధ్వానంగా తయారవుతుందో ఆ సినిమా కళ్ళకు కడుతుంది.
నిజానికి ఇది అధ్వైతం మలయాళ సినిమాకి రీమేక్. మోహన్ లాల్ హీరోగా నటించిన ఆ సినిమా అప్పట్లో మలయాళంలో సూపర్ హిట్టైంది. ఇలాంటి కాన్సెప్స్ట్ అక్కడ తరచుగా వస్తూంటాయి. అందుకే అదే సినిమాను తెలుగులో రీమేక్ చేసి కోడి రామకృష్ణ పొరపాటు చేశారు. ఇక జగపతి బాబు, ప్రియమణి జంటగా నటించిన ‘క్షేత్రం’ సినిమా కూడా దేవాలయాల కాన్సెప్ట్ తోనే సాగుతుంది. వేణుగోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఘోర పరాజయం పాలైంది. దేవాలయ భూముల స్కామ్ మీదే ఈ సినిమా కథాంశం కూడా సాగుతుంది. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి ..ఇదే కథాంశంపై తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ధర్మస్థలి అనే గ్రామం .. అందులోని ఒక దేవాలయం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఆ గ్రామంలో జరుగుతోన్న దేవాలయ భూముల కబ్జాను ఒక వ్యక్తి ఎదిరించి గ్రామస్థుల్లో ఎవేర్ నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ ప్రయత్నంలో అతడు హత్య చేయబడతాడట. దాంతో ఆయన కొడుకు రంగంలోకి దిగి.. తన తండ్రిని చంపినవారిపై ప్రతికారం తీర్చుకొని.. ఆ దేవాలయాల్ని రక్షిస్తాడట. మెయన్ థీమ్ టెంపుల్ కు సంబంధించిందే అయినా.. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ కు ఎలాంటి ఢోకా ఉండదని చెబుతున్నారు.
అలాగే.. చిరంజీవి ట్రేడ్ మార్క్ ఫైట్స్ కు , డ్యాన్సెస్ కు కొదవ ఉండదని అంటున్నారు. పైగా చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్ కూడా ఉంది. అయితే అంతా బాగానే ఉన్నా .. ఈ సినిమా కథాంశంపై తాజాగా ఒక వివాదం నడుస్తోంది. ఈ కథ తనదే అంటూ.. ఒక కో డైరెక్టర్ మీడియా ముందుకొచ్చాడు. ఈ సినిమా కథ తాను రాసుకున్న పుణ్యభూమి కథేనంటూ రచ్చ చేస్తున్నాడు. అసలే దేవాలయాల యాంటీ సెంటిమెంట్ ఉన్న టాలీవుడ్ కు.. ఈ వివాదం కూడా తోడవడం గమనార్హం. అయితే కొరటాల శివ దర్శకత్వ ప్రతిభ మీద అభిమానుల్లో ఉన్న నమ్మకం, అంచనాలు. ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ‘ఆచార్య’ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడో చూడాలి.











