ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కు ఎప్పుడూ మంచి రీచ్ ఉంటుంది. ప్రత్యేకించి ఈ లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీల్ని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించే కన్నడ చిత్రం ‘నన్న ప్రకార’. విధి వక్రిస్తే.. ఎలాంటి మోటివ్ లేకుండానే హత్యలు జరిగి.. అమాయకులు బలైపోతారు అని ఈ సినిమా నిరూపిస్తుంది. ఎంతో ఆసక్తిని కలగజేస్తూ.. చివరివరకూ కదలకుండా కూర్చోబెట్ట గలగడం ఈ సినిమా ప్రత్యేకత.
కథేంటి? : అశోక్ సిన్సియర్ పోలీసాఫీసర్. భార్య డాక్టర్ అమృత. ఒక రోజు ఒక కార్ యాక్సిడెంట్ కేస్ అశోక్ ను ఎలర్ట్ చేస్తుంది. ఆ కార్ డ్రైవ్ చేసిన యువతి మరణిస్తుంది. ఆమె ఫ్రెండ్స్ మిసింగ్ కంప్లైంట్ ఇస్తారు. యాక్సిడెంట్ లో మరణించిన యువతి తమ ఫ్రెండ్ విస్మయ గా గుర్తుపడతారు. కేస్ లోకి డీప్ గా ఇన్వాల్వ్ అయిన అశోక్ .. విశాల్ అనే ఒక డ్రగ్ డీలర్ ను అరెస్ట్ చేస్తాడు. అతడు చెప్పిన వివరాలు ప్రకారం ఆ కార్ లో ఉన్న యువతి .. తన ప్రియురాలు విస్మయ అని, ఆమె 5 నెలల గర్భిణి అని తెలిసిన తాను ఆవేశంలో ఆమె మీద చేయి చేసుకోగా.. ఆమె మరణించినట్టు.. ఆ డెడ్ బాడీని కార్ డిక్కీలో పెట్టి.. వేరే చోట డంప్ చేయడానికి వెళ్లే ప్రయత్నంలో తన కార్ మిస్ అయినట్టు చెబుతాడు .
అయితే అశోక్ డాక్టర్ భార్య.. కార్ లో మరణించిన యువతి, మిసింగ్ కేస్ గా రిజిస్టర్ అయి ఫోటో లో ఉన్న యువతి ఒకటి కాదనే షాకింగ్ విషయాన్ని చెబుతుంది. ఇద్దరి పేర్లు విస్మయ అవడం ఇందులో ట్విస్ట్. మరి ఇంతకీ విశాల్ చెప్పిన విస్మయ ఏమైనట్టు? కార్ యాక్సిడెంట్ లో మరో విస్మయ ఎలా మరణించినట్టు అనే సందేహాలు . ఈ కేస్ ను కాంప్లికేటెడ్ గా మార్చేస్తాయి. మరి అశోక్ ఆ కేస్ ను ఎలా సాల్వ్ చేశాడు? ఇద్దరు విస్మయలు ఎలా మరణించారు అన్నదే మిగతా కథ.
ఎలా తీశారు? : ఈ సినిమా స్టోరీని .. ఒక టీవీ ఛానల్ లో క్రైమ్ డైరీ అనే ప్రోగ్రామ్ లో యాంకర్ వివరించినట్టు చూపించడం ఆకట్టుకుంటుంది. ఒకే కార్ యాక్సిడెంట్ . ఒకే పేరున్న ఇద్దరు అమ్మాయిలు చనిపోతారు. కానీ అందులో ఒక్క డెడ్ బాడీనే దొరుకుతుంది. మరో డెడ్ బాడీ ఎలా మిస్ అయింది? చనిపోయిన ఇద్దరికీ ఏమాత్రం కనెక్షన్ ఉండదు. కానీ ఆ కారుకి, ఆ అమ్మాయిలకు కనెక్షన్ ఉంటుంది. ఇదెలా సాధ్యం? ఈ పాయింట్స్ ని ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా.. దర్శకుడు వినయ్ బాలాజీ డీల్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే ఈ రెండు మర్డర్స్ చేసిన వారికి ఎలాంటి మోటివ్ ఉండకపోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం. అశోక్ గా కిశోర్ , అతడి భార్యగా ప్రియమణి మంచి పెర్ఫార్మెన్ ఇచ్చారు.
హైలైట్స్ : ఇందులోని ప్రతీ సీన్ ను .. ముందుగా లాక్ చేసుకుంటూ వెళ్లి.. ప్రీక్లైమాక్స్ లో ఒకో ముడి విప్పుకుంటూ రావడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ప్రతీ పాయింట్ ను చాలా డీటెయిల్డ్ గా ఆవిష్కరించాడు దర్శకుడు. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే, ఆసక్తిని రేకెత్తించే సన్నివేశాలు ప్రేక్షకుడిని బాగా థ్రిల్ చేస్తాయి.
నటీనటులు : కిశోర్ , ప్రియమణి, మయూరి కేథరి, ప్రమోద్ శెట్టి, గిరిజా లోకేష్, అర్జున్ యోగి, నిరంజన్ దేశ్ పాండే తదితరులు
దర్శకత్వం : వినయ్ బాలాజీ
ఎక్కడ చూడాలి?: అమెజాన్ ప్రైమ్
భాష : కన్నడ
ఒక్కమాటలో : ఇంటెలిజెంట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
రేటింగ్ : 3.5 /5
–ఆర్కే