ఒక్క ఛాన్స్ అంటూ ఊరూవాడా ఊదరగొట్టేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ఎట్టకేలకు తన చిరకాల వాంఛనైతే తీర్చుకున్నారు గానీ… ఆయన మాటలు నమ్మి ఆయనకు తమ ఓట్లు వేయడంతో పాటుగా తమకు తెలిసిన వారి ఓట్లను కూడా వేయించిన మహిళల పరిస్థితి మాత్రం ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడిపోయింది. ఇదేదో ఏ విపక్షాలో చేస్తున్న ఒట్టి విమర్శ ఎంతమాత్రం కాదు. ఏపీ రాజకీయాలను మలుపు తిప్పగలిగిన జిల్లాలుగా పేరు గాంచిన ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళలకు ఎదురైన పరిస్థితి చూస్తే.. ఈ మాట నిజమేనని నమ్మక తప్పదు. ఆ జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళలకు ఏం జరిగిందంటారా..?

అనపర్తిలో..
తొలుత జగన్‌కు అభిమానంతో ఓటేసిన ఓ మహిళ ఉదంతం గురించి తెలుసుకుందాం. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలోని బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో కర్రి అరుణకుమారి(46) కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె భర్త స్థానికంగా విలేకరిగా పనిచేస్తున్నారు. వారు ఉంటున్నఇంటికి దారి లేకపోవడంతో కొన్నేళ్లుగా బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానాన్ని రహదారిగా వినియోగించుకుంటున్నారు. ఇటీవల హైస్కూల్‌కు ప్రహరీ నిర్మించడంతో దారిలేకుండా పోయింది. రహదారి మార్గాన్ని ఉంచి, మిగిలిన స్థలంలో గోడ నిర్మాణం చేయాలని ఆ ప్రాంత మహిళలంతా స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిని వేడుకున్నారు. అయినా ఆయన పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన అరుణకుమారి ఎమ్మెల్యేను ఉద్దేశిస్తూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ‘డబ్బులు కూడా తీసుకోకుండా మీపై అభిమానంతో ఓటు వేసినందుకు తగిన బుద్ధి చెప్పారు. వెడల్పయిన రోడ్డు నిర్మిస్తామని చెప్పి మోసం చేశారు’’ అని ఎమ్మెల్యేను ఉద్దేశించి ఆమె తన నోట్‌లో పేర్కొంది.
Must Read ;- మైనర్ బాలికపై అఘాయిత్యం.. నిందితున్ని తప్పించే ప్రయత్నాల్లో అధికార పార్టీ..
తాడేపల్లిగూడెంలో..
ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మరో మహిళ ఉదంతం మరింత విషమంగా ఉందని చెప్పాలి. జిల్లాలోని ప్రధాన పట్టణం తాడేపల్లిగూడేనికి చెందిన ఎం. ధనలక్ష్మీరెడ్డి చాలా కాలంగా వైసీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం… స్థానిక ఎమ్మెల్యే గెలుపు కోసం ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా అవిశ్రాంతంగా కష్టపడ్డారు. ఆమె కష్టఫలంతో పాటు స్థానికంగా ఉన్న మహిళల మద్దతులో మొన్నటి ఎన్నికల్లో అక్కడ వైసీపీనే విజయం సాధించింది. ఇక్కడి దాకా బాగానే ఉన్నా… అసలు సమస్య జగన్ సీఎం అయ్యాకే మొదలైంది. పట్టణంలోని ప్రధాన కూడలిలో నివాసం ఉండే ధనలక్ష్మీరెడ్డి ఇంటిని హస్తగతం చేసుకునేందుకు స్థానిక వైసీపీ నేతలు అధికారులను ఆమె కుటుంబంపైకి ఉసిగొల్పుతున్నారట. ఈ విషయం తెలుసుకున్న ఆమె హతాశురాలైందట. సొంత పార్టీ నేతల నుంచి వేధింపులు ఎదుర్కొనేందుకేనా తాను జగన్ గెలుపు కోసం శ్రమించింది అని ఆమె కన్నీరుమున్నీరు అవుతున్నారట. అయినా కూడా పార్టీ నేతలు ఆమె మొర వినకపోగా.. ఆమె ఇంటిని ఎలాగైనా లాగేసుకునేందుకే మరిన్ని యత్నాలు ప్రారంభించారట. ఈ క్రమంలో తన ఇంటి వద్ద సెంటర్‌లోనే దీక్షకు దిగిన ధనలక్ష్మీరెడ్డి… తనకు న్యాయం జరగకపోతే… ఏకంగా హైకోర్టును కూడా ఆశ్రయించేందుకు వెనుకాడేది లేదని తేల్చి చెబుతున్నారు.
మొత్తంగా ఈ రెండు ఘటనలు చూస్తుంటే… జగన్ సీఎం అయ్యాక మహిళలకు, ప్రత్యేకించి తనకు ఓటేసి గెలిపించిన మహిళలకు జగన్ సర్కారు తీరని అన్యాయమే చేస్తోందని చెప్పక తప్పదు. అది కూడా సొంత పార్టీకి చెందిన నేతలే ఇలా తమ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన మహిళల ఉసురు తీసేలా వ్యవహరిస్తుండటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
Also Read ;- జగన్ బావనా మజాకానా.. అనిల్‌కు ఎంత ఫుల్ సెక్యూరిటీనో చూశారా?











