వైసీపీ పెద్దలు ఎన్నిసార్లు పంచాయితీలు నిర్వహించినా వర్గపోరు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గీయులు మరోసారి రోడ్డునపడి కొట్టుకున్నారు. ఈ వర్గాల మధ్య తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో పంచాయితీ ముగిసిన మరుసటిరోజే, వారు చొక్కాలు చించుకుని కొట్టుకోవడం సంచలనంగా మారింది. ముండ్లమూరు మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బూచేపల్లి వర్గానికి చెందిన మండల వైసీపీ కన్వీనర్ సూర్యదేవర అంజయ్య, ఎమ్మెల్యే వర్గానికి చెందిన వైసీపీ గ్రామ నాయకుడు అంబటి వెంకటేశ్వరరెడ్డి వర్గీయుల మధ్య ఎప్పటి నుంచో పాత కక్షలు ఉన్నాయి. తాజాగా నిన్న రాత్రి ముండ్లమూరులో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. ఇరువర్గాల నేతలు దాడులు చేసుకున్నారు. బూచేపల్లి వర్గం నేతలు అంబటి వెంకటేశ్వరరెడ్డి నివాసంపై దాడికి కూడా యత్నించారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో గొడవ అదుపులోకి వచ్చింది.
దర్శిలో రెండుగా విడిపోయిన వైసీపీ శ్రేణులు
దర్శి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ప్రతి గ్రామంలో రెండు వర్గాలుగా విడిపోయాయి. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గాలు ప్రతి గ్రామంలో ఎవరికి వారే అన్న తీరుగా తయారయ్యారు. దర్శి మండలం చందలూరు గ్రామంలో 404 ఎకరాల అటవీ భూములను కబ్జా చేసుకునే విషయంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి, బూచేపల్లి మధ్య వైరం మరింత పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఎమ్మెల్యే సహకారంతో ఆ వర్గం నేతలు అటవీ భూములను కబ్జా చేసి దున్నుకుంటున్నారు. దీంతో బూచేపల్లి వర్గం రెవెన్యూ అధికారులను పిలిపించి సేద్యం జరగకుండా ఆపు చేయించారు. ఈ ఘటనతో రెండు వర్గాలు తలపడుతూనే ఉన్నాయి.
రెండు రోజుల కిందట ఇరు వర్గాల నేతలను తాడేపల్లి పిలిపించి పంచాయితీ నిర్వహించారు. అయినా ఎవరూ తగ్గడం లేదు. ఢీ అంటే ఢీ అంటున్నారు. ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, మరొకరు సీఎం సామాజికవర్గం కావడంతో గ్రామాల్లోనూ వైసీపీ శ్రేణులు రెండుగా విడిపోయి కొట్టుకుంటున్నారు.
కలకలం రేపిన కరపత్రాల పంపిణీ
దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ టీడీపీ వారిని చేరదీసి కాంట్రాక్టులు అన్నీ వారికే అప్పగిస్తున్నారని బూచేపల్లి వర్గం ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే ప్రతి మండలంలో ఏజంట్లను నియమించి, ప్రతి పనిలో కమిషన్ వసూలు చేస్తున్నారని బూచేపల్లి ఆరోపిస్తున్నారు. మద్దిశెట్టి అవినీతి, అక్రమాలు అంటూ కురిచేడులో కరపత్రాలు పంపిణీ చేయించడంతో ఇరు వర్గాల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బూచేపల్లితో తాడోపేడో తేల్చుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఎవర్వూ తగ్గేలా కనిపించడం లేదు.
ఇప్పటి నుంచే మొదలు పెట్టారా?
2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్ వచ్చినా బూచేపల్లి పోటీచేయడానికి నిరాకరించారు. బూచేపల్లి నిరాకరించడంతో మద్దిశెట్టిని రంగంలోకి దింపారు. అనూహ్యంగా మద్దిశెట్టి విజయం సాధించారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ నుంచి పోటీ చేయాలని బూచేపల్లి భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే మద్దిశెట్టిపై అవినీతి ఆరోపణలు చేస్తే అతనికి వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చే అవకాశం తగ్గిపోతుందని ఆయన భావిస్తున్నారని అందులో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని మద్దిశెట్టి వర్గం అభిప్రాయపడుతోంది. ఏది ఏమైనా దర్శి వైసీపీలో రచ్చ ఇప్పట్లో ఆగేదిలా కనిపించడం లేదు.
Must Read ;- ఎస్కేప్ : తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మిస్సింగ్ కనిపించడంలేదు