సినిమాకి మించిన వినోదసాధనం మరొకటి లేదు. అందుకే సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయడానికి ఎక్కువమంది ఇష్టపడతారు. ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందించిన సినిమాలు కాసుల వర్షం కురిపించాయి .. భారీ విజయాలను అందుకున్నాయి. ఈ కారణంతోనే తన సినిమాలకి సంబంధించిన కథల్లో వినోదం పాళ్లు పుష్కలంగా ఉండేలా దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. కథా వస్తువు ఏదైనా అందులో కామెడీ తగ్గకుండా చూసుకోవడం ఆయన ప్రత్యేకత .. అదే ఆయన విజయ రహస్యం కూడా.
‘పటాస్‘తో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన అనిల్ రావిపూడి, అప్పటి నుంచి ఒకదాని తరువాత ఒకటి .. ఒకదానికి మించి మరొకటి హిట్లు కొడుతూ వస్తున్నాడు. అలా ఆయన నుంచి క్రితం ఏడాది ‘సంక్రాంతి’కి వచ్చిన ‘ఎఫ్ 2’ భారీ విజయాన్ని నమోదు చేసింది. వెంకటేశ్ .. తమన్నా .. వరుణ్ తేజ్ .. మెహ్రీన్ .. రాజేంద్ర ప్రసాద్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, వినోదాల సందడి చేసింది .. సంక్రాంతి బరిలో విజేతగా నిలిచింది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే అనిల్ రావిపూడి చెప్పాడు.
ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు‘ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టిన అనిల్ రావిపూడి, ఆ తరువాత ‘ఎఫ్ 2’ కి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ చేయనున్నట్టు చెప్పాడు. ఆ మధ్య ఈ సీక్వెల్ కి సంబంధించిన కథపై కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ‘ఎఫ్ 2’ కి మించి ఈ సీక్వెల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ మాత్రమే కాకుండా మరో స్టార్ హీరో ఉంటాడనే టాక్ వినిపించింది. మూడో హీరోగా రవితేజ కనిపించే అవకాశాలు ఎక్కువనే ప్రచారం ఊపందుకుంది.
జోరుగా సాగుతున్న ఈ ప్రచారాన్ని గురించి తాజాగా అనిల్ రావిపూడి స్పందించాడు. ఈ సినిమాలో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ మాత్రమే కథానాయకులుగా కనిపిస్తారనీ, మూడో హీరో ఎవరూ ఉండరని ఆయన స్పష్టం చేశాడు. దాంతో ఇప్పటివరకూ ఈ విషయంపై జరుగుతున్న ప్రచారానికి తెరదించినట్టైంది. వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ జోడీగా మెహ్రీన్ అల్లరి మాత్రమే మళ్లీ షురూ కానుంది. కొంతకాలంగా జాడలేకుండా పోయిన మెహ్రీన్, ‘హనీ ఈజ్ ద బెస్ట్’ అంటూ మళ్లీ ఈ సీక్వెల్ తో సందడి చేయనుందన్నమాట.
Must Read ;- సామ్ జామ్ లో ఫ్యాషన్ దుస్తులతో ప్రేక్షకులను కట్టిపడేసిన తమన్నా.. !