సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన కక్షతో వీధి కుళాయి వద్ద గొడవ పడి వైసీపీ వర్గీయులు టీడీపీకి చెందిన వారిపై దాడి చేసి ఇద్దరిని తీవ్రంగా గాయపరిచారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఉప్పెన వలస గ్రామంలో టీడీపీకి చెందిన 8 మందిపై వైసీపీకి చెందిన వారు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వైసీపీకి చెందిన సిరిపురపు వెంకట రమణ, శ్రీను, అప్పయ్య, బామ్మర్ది బలరాం వర్గాలు టీడీపీకి చెందిన కర్ర పాటి కిషోర్ ,కే రాజు,ఎర్రమ్మ,గన్నమ్మ, సవలపురం రాజులపై దాడి చేశారు. బాధితులందరినీ శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. వీరిలో కిషోర్, కేరాజుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ అనుచరులే ఈ దాడిలో ప్రధాన సూత్రధారులని భాదిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఆయన అండతోనే దాడి చేశారని వారు అంటున్నారు. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందడంతో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఈరోజు పధకం ప్రకారం కత్తులతో దాడి చేసినట్టు బాధితులు మీడియాకు తెలిపారు. నిందితులను వెంటనే అరెస్టు చేయకపోతే తీవ్ర ఉద్యమం చేస్తామని బాధితులు అంటున్నారు. డిఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వరంలో పోలీసులు గ్రామాన్ని సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. మూడు రోజుల క్రితం కత్తులతో బెదిరించారని, పోలీసులకు తెలిపినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ రోజు దాడి చేశారని టీడీపీ నాయకులు కూన రవికుమార్ అన్నారు.రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.










