( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో ఉద్యమ సెగలు భగ్గుమంటుండగా, విశాఖ బీజేపీ నేతలు మాత్రం కిమ్మనడం లేదు. విశాఖలో బీజేపీకి రాష్ట్రంలో మరెక్కడా లేని గుర్తింపు ఉందనే చెప్పాలి. గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని విశాఖలో పలు స్థానాల్లో పోటీ చేసి గెలుపొందిన చరిత్ర బీజేపీకి ఉంది. 32 మంది ప్రాణత్యాగాలు, వేలాది మంది పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రతిపాదన చేయడంతో రాష్ట్రంలో మరో ఉద్యమం మొదలైంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం గతంలో ఉద్యమిస్తే.. ఇప్పుడు దానిని కాపాడుకునేందుకు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇటువంటి తరుణంలో అండగా ఉండాల్సిన రాష్ట్ర బీజేపీ నేతలు, విశాఖ బీజేపీ నాయకులు ముఖం చాటేశారన్న విమర్శలు వస్తున్నాయి.
ప్రారంభంలో హడావుడి..
కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రారంభంలో రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఘాటుగా స్పందించారు. ఆంధ్రుల ఆత్మగౌరవ మైన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయడం మంచి నిర్ణయం కాదని చెప్పుకుంటూ వచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ కార్యదర్శి పురందేశ్వరి తదితరులు అనుకూలంగా మాట్లాడారు. తరువాత ఏం జరిగిందో ఏమో… కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని నేతలు అన్నారో ఏమో? అప్పటి నుంచి బీజేపీ నాయకులు ఆ ఊసే ఎత్తడం లేదు. ఎవరైనా వారిని కలిసి వినతి పత్రాలు సమర్పిస్తే సరే అంటూ.. తీసుకుంటున్నారు తప్ప ఎటువంటి బహిరంగ ప్రకటనలు చేయడం లేదు.
ఎమ్మెల్యే.. ఎంపీను ఇచ్చిన నగరం..
రాష్ట్రంలో మరెక్కడా బీజేపీ ఉనికి లేని సమయంలో విశాఖలో తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని..ఓక ఎంపీ, ఎమ్మెల్యేకు విశాఖ ప్రజలు అవకాశం ఇచ్చారు. ఎంపీగా హరిబాబు, ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజుకు విశాఖ ప్రజలు పట్టం కట్టారు. తదనంతర కాలంలో ఎమ్మెల్సీగా మాధవ్ గెలుపొందారు. తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి తరువాత ప్రజలు అంతగా బీజేపీని సొంతం చేసుకున్న జిల్లా ఇది. అటువంటి ప్రజలకు కష్టం వచ్చినప్పుడు… పార్టీ ప్రయోజనాలు.. కేంద్రం ఆదేశాలు ముఖ్యమని జిల్లా నాయకులు భావించడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. పైగా కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అన్నట్టు.. పలు సందర్భాల్లో ప్రస్తావించడం ఉద్యమకారులను మరింత కలచివేస్తోంది. ప్రస్తుతం విష్ణుకుమార్‌రాజు, హరి బాబు మాజీలు గానే ఉన్నారు. అయినప్పటికీ వారు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించేందుకు ఆసక్తి చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. పార్టీ వారిపై సీరియస్ అయినా పోయేది ఏమీ లేదన్నవాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ఒడిశా పెత్తనం.. పథకం ప్రకారం విశాఖ ఉక్కు నిర్వీర్యం

ఒక అడుగు ముందేసిన టిడిపి..
విశాఖలో ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేందుకు టీడీపి కీలకంగా మారింది. తొలుత గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆపై గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. దీంతో గాజువాక టీడీపీ కార్యాలయం ఉద్యమకారులతో నిండిపోతోంది. తాము రాజీనామాలు చేయబోమని, పదవుల్లో ఉంటేనే పార్లమెంటులో ప్రశ్నించేందుకు వీలుంటుందని కుంటి సాకులు చెబుతూ అధికార పార్టీ నేతలు తమ పదవులు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నవిమర్శలొస్తున్నాయి. ఉక్కు ఉద్యమంలో భాగంగా 1960వ దశకంలో 167 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. మరి వారంతా ఈ విషయం తెలియకనే చేశారని భావించాలా? ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయడం ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తుందని, ఉద్యమం విషయంలో వైసీపీ కపట నాటకానికి ఇదొక ఉదాహరణ మాత్రమే అని అంటున్నారు.
మూడు రాజధానులు అంశం..
మూడు రాజధానుల ప్రతిపాదనను అధికారపార్టీ తెరపైకి తెచ్చిన వెంటనే.. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆ నిర్ణయాన్ని విశాఖ వాసిగా స్వాగతిస్తామని ప్రకటనలు చేశారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా అమరావతిని రాజధానిగా కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నప్పటికీ… పార్టీ నియమాలను, క్రమశిక్షణను ఉల్లంఘించి స్థానిక టీడీపీ నాయకులు ప్రకటనలు చేశారు. ప్రాంతీయ పార్టీ నాయకులు చేసే సాహసం కూడా.. జాతీయ పార్టీ బీజేపీ నాయకులు చేయలేకపోవడం విచారకరం. విశాఖవాసులుగా తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు సైతం భయపడుతున్న తీరును చూసి ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు తమ తీరు మార్చుకోవాలని కోరుతున్నారు.
Must Read ;- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై 18న ఆందోళన.. చంద్రబాబు పిలుపు