టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర 3 వేల కిలో మీటర్ల మైలురాయిని చేరింది. పాదయాత్ర ప్రారంభం అయిన 218 రోజులకే లోకేశ్ ఈ ఘనత సాధించారు. అధికార పక్షం వైఎస్ఆర్ సీపీ అక్రమాలను ఎండగడుతూ, వచ్చే ఎన్నికల్లో వారి పీడను ప్రజలకు వదిలించాలనే ఉద్దేశంతో యువగళం పేరుతో పాదయాత్రను ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి లోకేశ్ పాదయాత్ర సాగుతోంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు యువగళం పాదయాత్ర చేపట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, రాష్ట్రంలో కొన్ని పరిణామాల కారణంగా విశాఖపట్నం వరకే యాత్రను కుదించారు.
నారా లోకేశ్ పాదయాత్ర 3 వేల కిలో మీటర్ల మార్కు.. తూర్పు గోదావరి జిల్లాలో గత రాత్రి బస చేసిన తేటగుంట హైవే వద్ద చేరుకుంది. తేటగుంట హైవేకి చేరేసరికి మొత్తం 3,006.7 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తయింది. 3 వేల కిలో మీటర్ల మైలురాయికి గుర్తుగా సోమవారం ఇక్కడ లోకేశ్ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ కూడా హాజరు కానున్నారు. సోమవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోకి యువగళం ప్రవేశించనుంది. ఉభయగోదావరి జిల్లాల నాయకులు, కార్యకర్తలు లోకేశ్ కు వీడ్కోలు పలకనున్నారు. విశాఖ జిల్లాలోకి ఘన స్వాగతం పలకడానికి ఉత్తరాంధ్ర నాయకులు రెడీ అయ్యారు. ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తం 23 రోజులపాటు పాదయాత్ర కొనసాగింది. ఈ రెండు జిల్లాల్లోనే 404 కిలో మీటర్ల మేర యాత్ర కొనసాగింది.
యువగళం పాదయాత్ర 153 రోజులు పూర్తి చేసుకున్న వేళ గత జులై నెలలో 2 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరింది. ఇందుకు గుర్తుగా నెల్లూరు జిల్లా కొత్తపల్లి వద్ద అప్పుడు లోకేశ్ పైలాన్‌ను ఆవిష్కరించారు. పాదయాత్ర 77వ రోజులో ఉన్నప్పుడు.. కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో గత ఏప్రిల్ నెలలో 1000 కిలోమీటర్ల మైలురాయిని లోకేష్ క్రాస్ చేశారు. తాజాగా 218 రోజులకు 3 వేల కిలో మీటర్ల మైలురాయిని చేరారు.
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తారనే విషయం బయటికి రాగానే అధికార వైఎస్ఆర్ సీపీ నేతలు వరుసగా ఎగతాళి చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఈ యాత్రలో లోకేశ్ కు విపరీతమైన జనాదరణ దక్కుతోంది. యాత్రకు స్వచ్ఛందంగా వస్తున్న జనాల్ని చూసి అధికార పార్టీ నేతలకు కన్నుకుడుతోంది. భగ్నం చేసేలా ఎన్నో ప్రయత్నాలు చేశారు. లోకేశ్ పాదయాత్రకు సహకరించిన వారిపై కేసులు నమోదు చేయడం, హాజరైన ప్రజలను వాలంటీర్లతో బెదిరింపులకు గురిచేయడం లాంటివి ఎన్నో జరిగాయి. యాత్ర జరుగుతున్న ప్రతిచోట లోకేశ్ వివిధ వర్గాల వ్యక్తులను కలుస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు. మరికొద్ది నెలల్లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యలు తీరుస్తామంటూ వారికి హామీ ఇస్తున్నారు.










