రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి చేసిన కామెంట్లు ఏపీలోనే కాదు.. తెలంగాణ ఉద్యోగ సంఘాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము ఎన్నికల్లో పాల్గొనేది లేదని కొన్ని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో వెంకట్రామిరెడ్డి ఓ మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చంపే హక్కు కూడా రాజ్యాంగం తమకు ఇచ్చిందని వ్యాఖ్యానించినట్లు పెద్దయెత్తున్న ప్రచారం జరిగింది. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నాయి. ఈ విషయం ఈసీ వరకు చేరడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీజీపీకి లేఖ రాశారు. తనను ఉద్దేశించి వెంకట్రామిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్న ఎస్ఈసీ వెంకట్రామిరెడ్డి తనపై భౌతిక దాడులకు దిగే అవకాశం ఉందని లేఖలో అభిప్రాయ పడ్డారు. దీంతో వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా పెట్టాలని డీజీపీని ఎస్ఈసీ నిమ్మగడ్డ కోరారు. కాగా ఓ ఉద్యోగ సంఘ నాయకుడిపై ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డీజీపీకి ఫిర్యాదు చేయడం సంచలన అంశంగా మారింది.
ఆ వ్యాఖ్యలతో మొదటికే మోసం..
ఇక వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యల విషయానికి వస్తే..ఆయన తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అవసరమైతే చంపేందుకుదైనా సిద్ధం అన్నారన్న విషయానికి వస్తే.. ఆ ఎదుటి వారు ఎవరు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆ ఎదుటివారు… ఎన్నికల సంఘమా లేక ఎన్నికలు నిర్వహించేందుకు తీర్పునిచ్చిన హైకోర్టా లేక మరో వ్యవస్థా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ కోణంలోనే టీడీపీతో పాటు ఇతర పక్షాలూ విమర్శించాయి. ఇక కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఈ వ్యాఖ్యలతో అంతర్గతంగా విభేదించారు. ఎన్నికలు ఇప్పట్లో వద్దని తాము చేస్తున్న వాదనతో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ఎన్నికల వాయిదా కోసం ఇన్నాళ్లు చేసిన పోరాటం ఈ వ్యాఖ్యల వల్ల గాడితప్పతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. మీడియాతో, వేదికలపై గంభీరంగా కనిపిస్తున్నా.. తమకూ ఉద్యోగ భయం ఉంటుందని, సంఘాలను నమ్ముకుంటే..అన్ని సందర్భాల్లో న్యాయం జరగుతుందన్న విశ్వాసం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎన్నికల నిర్వహణలో తాము పాలుపంచుకోమని చెప్పడం, హక్కుల కోసం మాట్లాడడం వరకు పరిమితమై ఉంటే బాగుండేదని, చంపడం అనే పదం చాలా డామేజీ చేసిందని చెబుతున్నారు. అంతేకాదు.. సోమవారం సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరగనుంది. ఉద్యోగ సంఘాలు కూడా కూడా తమ తరఫున వాదన వినిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాకర్ల వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు ముందుకు వెళ్తే.. ఎవరిని బెదిరిస్తున్నారని సుప్రీంకోర్టు ఒక వేళ ప్రశ్నిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. తమ హక్కులు కాపాడుకునేందుకు ఎదుటి వారిని చంపుతామనే ప్రస్తావన ఇక్కడ అప్రస్తుతం అనే వాదన వినిపిస్తోంది.
Must Read ;- ఉద్యోగులకు సంఘాలా.. సర్కారుకు బాకాలా!
21వ అధికరణ ప్రకారం..
ఇక ఆ హక్కు విషయానికి వస్తే.. ‘అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాన్ని కాపాడుకునేందుకు పోలీసులకు లేదా అధికారిక రక్షకులకు సమాచారం ఇచ్చి, వారు సకాలంలో రాలేనప్పుడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం జరిగిన ఘర్షణలో ఎదుటి వ్యక్తికి ప్రాణహాని జరిగినా అది ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్యగా పరిగణింపబడదు. అయితే, అందుకు సాక్ష్యాలు బలంగా ఉండాలి. ఈ ఘర్షణలో ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తికి..ఎదుటి వ్యక్తిని చంపుదామన్న దురాలోచన, ఐపీసీల్లోని ‘హత్య’ అనే అంశానికి సంబంధించిన ఆరోపణలు, ముందుగా ప్లాన్ చేసుకోవడం లాంటివి ఉండ కూడదు. ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం జీవించే స్వేచ్ఛ నుంచి, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 299-377వరకు ఉన్న నిబంధనలు వర్తిస్తాయి.
ఉద్యోగాలకు ముప్పు వస్తే..
మొత్తం మీద కాకర్ల వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యల విషయంలో ఉద్యోగ సంఘాల్లోనే కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు.. ఆయన చెప్పినట్లు చేసినా..ఇకముందు ఆ పరిస్థితి ఉండకపోవచ్చని, ఈ వ్యాఖ్యల పరిణామాలు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటాయోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అదే జరిగితే తమ ఉద్యోగాలకు భద్రత ఉండదని ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం మీద ‘చంపే’హక్కుపై మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తమ ఉద్యోగ హక్కు, జీవించే హక్కుకు ఇబ్బంది కలిగించేలా మాట్లాడుతున్నారని, ఆయనకు ఉద్యోగం లేకపోయినా బతకగలరేమో కాని..తమకు ఆ పరిస్థితి లేదనే చర్చ అంతర్గతంగా నడుస్తోంది.
Also Read ;- స్థానిక ఎన్నికలకు సహకరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి.. గవర్నర్‌ను కోరిన నిమ్మగడ్డ