ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు ఇవాళ నాంపల్లి ఈడీ కోర్టులో విచారణకు వచ్చింది. అక్రమాస్తుల కేసులో ఈడీ కోర్టు విచారణ ఎదుర్కొంటున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాదులు మోమో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో A1గా ఉన్న సీఎం జగన్మోహన్‌రెడ్డి తప్పనిసరిగా హాజరు కావాలని గత వారం ఈడీ కోర్టు ఆదేశించింది. అయినా సీఎం అమ్మఒడి కార్యక్రమం ప్రారంభోత్సవంలో బిజీగా ఉన్నారని జగన్ తరఫు న్యాయవాది మెమో దాఖలు చేశారు. కేసు విచారించిన నాంపల్లి ఈడీ కోర్టు తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ కేసులో A2గా ఉన్న వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరయ్యారు.
ఈడీ కోర్టులో కేసు విచారణ రోజే పథకాల ప్రారంభం!
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకునేందుకే, విచారణ రోజే పథకాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈడీ కోర్టు తప్పని సరిగా హాజరు కావాలని ఆదేశించిన రోజే సీఎం నెల్లూరులో అమ్మఒడి కార్యక్రమం పెట్టుకున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. సీఎం కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు వచ్చిన రోజు గ్యారంటీగా ఓ పథకాన్ని ప్రారంభిస్తారని ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ ఈడీ కోర్టు విచారణ నుంచి ఎంతో కాలం తప్పించుకోలేరని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
Must Read ;- జగన్ స్పెషలేం కాదు.. ప్రతివారం కోర్టుకు రావాల్సిందే