అమరావతి మహిళలపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు జగన్ చెల్లెలు, ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల. మహిళలను కించపరుస్తూ సజ్జల ఒక మూర్ఖుడిలా మాట్లాడారని మండిపడ్డారు. వైసీపీ చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తోందన్నారు. సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి గతంలో సోషల్‌మీడియాను అడ్డుపెట్టుకుని తనపై కూడా దుష్ప్రచారం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. వైఎస్ కుమార్తె, ఒక మహిళ అని కూడా చూడకుండా కించపరిచారని ఆరోపించారు. జగన్ అందరినీ నా అక్కాచెల్లెళ్లు అంటారు.. కానీ, ఆయన సొంత చెల్లికే మర్యాద లేదన్నారు షర్మిల. ఇక రాష్ట్రంలోని మహిళలను జగన్ ఏం గౌరవిస్తారని ప్రశ్నించారు.
ఇక రోజాకు సైతం ఇచ్చిపడేశారు షర్మిల. రక్త సంబంధాల గురించి, అక్కా , చెల్లెళ్ళ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. రక్త సంబంధం విలువ ఏంటో తనకు మాత్రమే తెలుసు అని అన్నారు షర్మిల. తన ఇంటి నుంచే తనపై విష ప్రచారం చేశారని , తనకు అక్రమ సంబంధాలు అంటగట్టారని , తను వైఎస్సార్ కు పుట్టలేదని సైతాన్ సైన్యంతో ప్రచారం చేయించారని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. జగన్ అడిగాడని, భర్త, పిల్లలను వదిలేసి మూడు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానన్నారు షర్మిల. అది రక్తసంబంధానికి ఇచ్చిన విలువ అంటూ షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. పాప నీ ప్రాణం కావాలని జగన్ అడిగినా ఇచ్చేదాన్ని అంటూ చెప్పుకొచ్చారు.
తల్లిని,చెల్లిని దూరం చేసుకున్న నాడే జగన్ మనిషి జాబితా నుంచి బయటకొచ్చారని ఫైర్ అయ్యారు షర్మిల. మీరు అసలు మనుషులే కాదంటూ నిప్పులు చెరిగారు. రక్త సంబంధాల గురించి మాట్లాడేందుకు రోజాకు సిగ్గుండాలి అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.











