ఐపీఎల్ 2021.. ఆటగాళ్లపై కనక వర్షం కురిపించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. వేలం సాగింది. గతేడాది ప్రదర్శనతో సంబంధం లేకుండా కొనుగోలు జరిగింది. ఐపీఎల్ చరిత్రలో యువరాజ్ సింగ్ పేరుతో ఉన్న రికార్డు బద్దలైంది. దక్షిణాఫ్రికా పేస్‌బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను దక్కించుకునేందుకు భారీ పోటీనే జరిగింది. అత్యధిక ధరకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే హైఎస్ట్ రెమ్యూనరేషన్.. క్రిస్ మోరిస్ పేరున పదిలమైంది.
జాక్ పాట్ కొట్టేశారుగా..
ఐపీఎల్ వేలం.. ఈసారి ఆద్యంతం ఉత్కంఠతతో సాగింది. అందరూ ఊహించిన దానికంటే ఆసక్తిగా సాగింది. గతేడాది ఆటగాళ్ల ప్రదర్శనలను ఫ్రాంచైజీలు దృష్టిలో పెట్టుకోలేదు. ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంచారు. అందుకే గతేడాది తీవ్రంగా నిరాశ పరిచిన ఆటగాళ్లకు కూడా అనూహ్య ధర పలికింది. అందులో మోరిస్, మాక్స్‌వెల్, మొయిన్ అలీ, శివమ్ దూబె, షకిబ్ ముందు వరుసలో ఉన్నారు. వీరితోపాటు మరెందరికో గొప్ప అవకాశం లభించింది.
మోరిస్ @ రూ.16.25 కోట్లు
దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్‌మోరిస్ రికార్డులు తిరగరాశారు. ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఘనత సాధించారు. మోరిస్ కనీస ధర రూ. 75 లక్షలు ఉండగా అతని కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ముంబై ఇండియన్స్-రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌లు అతని కోసం పోటీ పడ్డాయి. చివరకు రాజస్తాన్ రాయల్స్ దక్కించుకుంది. ముంబై ఇండియన్స్ రూ.12 కోట్ల 50 లక్షల వరకూ వెళ్లగా, పంజాబ్ కింగ్స్ రూ.14 కోట్ల వరకూ బిడ్ వేసింది. కానీ రాజస్తాన్ రాయల్స్ పట్టువదలకుండా మోరిస్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర దక్కింకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పారు.
ఎవరి ధర ఎంతంటే..
చెన్నైలో జరిగిన వేలంలో మోరిస్ అత్యధిక ధరకు అమ్ముడుపోగా.. రెండో స్థానంలో కైల్ జేమీసన్ నిలిచారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడిని రూ.15 కోట్లకు సొంతం చేసుకుంది.
ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.9.25 కోట్లకు దక్కించుకుంది. ఆస్ట్రేలియా ఆటగాడు మెరెడిత్‌ను పంజాబ్ రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది.
ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని రూ.14.25 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కైవసం చేసుకుంది. హార్డ్ హిట్టర్‌గా మ్యాక్స్‌వెల్‌కు మంచి పేరు ఉంది. స్పిన్ బౌలింగ్‌తోనూ అతడు జట్టుకు కలిసివస్తాడు. మంచి ఫీల్డర్ కూడా. అయితే, అతడు స్థిరంగా రాణించలేకపోతున్నారు. అందుకే కింగ్స్ ఎలెవన్ జట్టు మ్యాక్స్‌వెల్‌ను వదులుకుంది. ఇదివరకు అతడు ముంబయి, దిల్లీ జట్లకు కూడా ఆడారు.
ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.9.25 కోట్లకు దక్కించుకుంది.
ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ను రూ.2.2 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్ జట్టు సొంతం చేసుకుంది. ఇదివరకు స్మిత్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు. అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్‌గా స్మిత్ విఫలమవ్వడంతో ఆ జట్టు అతడిని వదులుకుంది. అయితే, అతడికి నాయకత్వ పటిమ ఉంది. ఎలాంటి పిచ్‌పైనైనా పరుగులు రాబట్టగలరు. ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తారు.
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పంజాబ్‌తో పోటీపడి రూ.7 కోట్లకు దక్కించుకుంది.
భారత బౌలింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.4.4 కోట్లకు సొంతం చేసుకుంది.
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ.3.2 కోట్లకు దక్కించుకుంది.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్‌సన్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 14 కోట్లకు దక్కించుకుంది.
బ్యాట్స్‌మన్ హనుమ విహారీ వేలంలో అమ్ముడవ్వలేదు. రూ.1 కోటి బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడిపై ఏ జట్లూ ఆసక్తి చూపలేదు.
Must Read ;- ఐపీఎల్ 2021: ఏయే ఫ్రాంచైజీల్లో ఎవరెవరు ఆడనున్నారంటే!