(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం పర్యటనలో విజయసాయిరెడ్డి వాహనంపై దాడి ఘటనలో A1గా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును, A2గా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును, A3గా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు పేర్లను పోలీసులు చేర్చినట్లు బయటకు లీకు అవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వీరితోపాటు .. ఈ ఘటనకు సంబంధించి మరో 12 మందిని నిందితులుగా పోలీసులు చేర్చినట్లు తెలుస్తోంది. దీనిపైనా విజయనగరం జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటననూ విడుదల చేయనప్పటికీ .. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా దావానలంలా వ్యాప్తి చెందింది.
‘కళా’ వ్యవహారంతో ..
రామతీర్థం ఘటనలో బుధవారం నాడు కళా వెంకటరావును విజయనగరం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని .. అనంతరం నోటీసు ఇచ్చి విడుదల చేశారు. రామతీర్థం పర్యటనలో విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్లు, చెప్పులు వేయించారనే.. అభియోగంపై కళా వెంకట్రావును అదుపులోకి తీసుకున్నారు. రాజాం పట్టణంలోకి బుధవారం రాత్రి భారీ సంఖ్యలో పోలీసు బలగాలు వచ్చి కళా వెంకటరావును అదుపులోకి తీసుకుని .. సమీపంలోని విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కళా వెంకట్రావు అరెస్టుపై రాష్ట్ర టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలోఆగ్రహం వ్యక్తం చేయడం .. చీపురుపల్లి పోలీసు స్టేషన్ వద్దకు రాత్రికి రాత్రే పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలిరావడంతో .. పరిస్థితి చేయిదాటుతుందని భావించిన పోలీసులు కళా వెంకట్రావును విడిచి పెట్టారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి అర్థరాత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో కళా వెంకట్రావు A3 అని చెప్పడంతో A1, A2 ఎవరనేదానిపై జిల్లాలో అప్పటినుండి తీవ్రంగా చర్చలు సాగుతున్నాయి. శుక్రవారం నాటి ఈ లీకులతో చర్చలకు మరింత బలం చేకూరింది.
Must Read ;- అన్యాయాన్ని ప్రశ్నించినవారిని అరెస్ట్ చేస్తారా ? : కళా
జగన్ అధికారంలోకి వచ్చాక ..
ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలు, దేవుళ్ల విగ్రహాలపై దాడులు పెరిగిపోయాయన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనతోపాటు రామతీర్ధంలో శ్రీరాములవారి విగ్రహం ధ్వంసం ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ క్రమంలోనే వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రామతీర్థ పర్యటనలో ఉద్రిక్తత ఏర్పడిన సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డికి ధ్వంసమైన కోదండరాముని విగ్రహం చూసేందుకు అనుమతిచ్చిన అధికారులు .. చంద్రబాబుకు అనుమతివ్వకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
అంతేకాకుండా చంద్రబాబు పర్యటనకు వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని, వారికి పోలీసులు పూర్తి స్థాయిలో సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వేరొకవైపు రామతీర్థం పర్యటనలో విజయసాయి రెడ్డి వాహనం మీద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసిన ఘటన కూడా కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల క్రితం టీడీపీ నేత కళా వెంకట్రావును చీపురుపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడం, నోటీసులివ్వడం, నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులను ఇప్పటికే రిమాండ్ కు తరలించడంపై తెలుగుదేశం శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో A1గా చంద్రబాబు నాయుడును చేర్చడం పట్ల టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో వేచిచూడాలి.
Also Read ;- విగ్రహాల ధ్వంసం కేసులో పాస్టర్ అరెస్టు