తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా.. ధర్మపురి శ్రీనివాస్ ఓ వెలుగు వెలిగారు. వైఎస్సార్, డీఎస్ జోడీ గెలుపు గుర్రాలంటూ మంచి ఆప్లాజ్ కూడా వచ్చింది. అయితే వైఎస్సార్ మరణం తర్వాత డీఎస్ ఒక్కసారిగా తీవ్ర ఆటుపోట్లకు గురయ్యారు. ఆ తర్వాత తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోవడం, రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో డీఎస్ రాజకీయ ప్రస్థానమే ప్రశ్నార్థకంగా మారింది. అయితే రాజకీయాలన్నాక.. ఏదో ఒక పార్టీలో ఉండాల్సిందే కదా. అందుకే అధికార టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందగానే డీఎస్ అందులో చేరిపోయారు. ఆయనతో పాటు ఆయన పెద్ద కుమారుడు సంజయ్ కూడా తండ్రి బాటలోనే నడిచారు. ఇక మొదటి నుంచి బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న అరవింద్.. తండ్రి బాటలోకి వచ్చేందుకుయ ససేమిరా అన్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి.. ఏకంగా కేసీఆర్ కుమార్తె, అక్కడి సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను చిత్తు చేశారు. ప్రస్తుతం అరవింద్ బీజేపీలో ఓ వెలుగు వెలుగుతున్నట్లే లెక్క.
త్వరలోనే ఆ పదవీ పాయే..
అయితే టీఆర్ఎస్ లో చేరాక.. ఏదో అలా రాజ్యసభ సీటైతే ఇచ్చారు గానీ.. అసలు డీఎస్ ను పట్టించుకున్న గులాబీ నేతలే కనిపించడం లేదట. పార్టీ అధిష్ఠానం నుంచి కూడా ఆయనను కనీసం పలకరింపు కూడా లేదట. దీంతో డీఎస్ కూడా పెద్దగా బయటకే రావడం లేదు. ఇక టీఆర్ఎస్ నుంచి దక్కిన రాజ్యసభ సభ్యత్వం పదవీ కాలం కూడా త్వరలోనే ముగియనుంది. ఇలాంటి క్రమంలో డీఎస్ వెంటే నడిచిన ఆయన పెద్ద కుమారుడు సంజయ్…మొన్నామధ్య టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. అంటే.. ప్రస్తుతానికి డీఎస్ టీఆర్ఎస్ లో ఉంటే.. అరవింద్ బీజేపీలో ఉన్నారు. కొత్తగా సంజయ్ తన సొంత గూడు కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. మొత్తంగా ఒకే ఇంటిలోని ముగ్గురు నేతలు మూడు పార్టీల్లో ఉన్నట్లే కదా.
డీఎస్ ఏమన్నారంటే..?
అయితే ఉన్న మాట అంటే ఉలుకెందుకు? అన్న రీతిలో ఇదే మాట అంటే మాత్రం డీఎస్ తెగ బాధపడిపోతున్నారు. ఈ వ్యాఖ్యలపై డీఎస్ ఏ రీతిన బాధ పడ్డారంటే.. నేను ఏ పార్టీలో ఉన్నానన్న విషయం నాకే తెలియడం లేదు. పార్టీ కార్యక్రమాలకు రావాలంటూ టీఆర్‌ఎస్ నుంచి ఆహ్వానాలు రావడం లేదు. నేను అసలు టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడినేనా? అన్న విషయాన్ని సీఎం కేసీఆర్‌నే అడగాలి. ఒకే ఇంట్లో మూడూ పార్టీలంటూ మాపై కొందరు విమర్శలు చేస్తున్నారు. చాలామంది ఎంపీల ఇళ్లల్లో భార్య ఒక పార్టీలో, భర్త ఇంకో పార్టీలో ఉన్నారు. తాను గతంలో పీసీసీ అధ్యక్షుడిగా చక్రం తిప్పా. నా కుమారుడు అరవింద్ బీజేపీలో చేరినప్పుడు కూడా వ్యతిరేకించలేదు. అరవింద్ కష్టపడి గెలిచి లోక్‌సభ సభ్యుడు అయ్యాడు అని డీఎస్ తనదైన శైలిలో మదనపడిపోయారు. అయినా ఉన్న మాట అంటే ఉలకు ఎందుకు సారూ అంటూ డీఎస్ పై ఇప్పుడు పెద్ద ఎత్తున సెటైర్లు పడిపోతున్నాయి.
Must Read ;- రేవంత్ దూకుడు.. టీఆర్ఎస్ కు ముచ్చెమటలు!











