అప్పటికి ఆయన మెగాస్టార్ కాదు, కనీసం సుప్రీమ్ హీరో కూడా కాదు. కానీ ఆ రెండు బిరుదులు అందుకోవడానికి పునాదులు వేసిన సినిమాల్లో ఒకటి ”ఊరుకిచ్చిన మాట”. చిరంజీవి అప్పటికి ఔత్సాహిక (వర్థమాన నటుడు కూడా కాదు) నటుడు మాత్రమే. అలాంటి టైమ్ లో వచ్చిన ”ఊరుకిచ్చిన మాట”.. ఒక్కసారిగా అందరూ చిరంజీవి వైపు తిరిగి చూసేలా చేసింది.
తమ్ముడి కోసం ఆరాటపడే అన్నయ్య.. ఊరికిచ్చిన మాట కోసం ఎంతకైనా తెగించే కుర్రాడు.. అమ్మాయి మనసు గెలుచుకున్న కలల రాకుమారుడు.. ఇలా ఎన్నో షేడ్స్ లో ఈ సినిమాలో చిరంజీవి కనిపించి ఆకట్టుకున్నారు. అప్పట్లో ఆయన హెయిర్ స్టయిల్ ఓ ట్రెండ్. కృష్ణంరాజు తర్వాత అలాంటి ఫంకీ హెయిర్ స్టయిల్ చిరంజీవికి మాత్రమే ఉండేది.
ఇక ఈ సినిమాతోనే హీరోయిన్ మాధవి చిరంజీవికి ఫ్యాన్ అయిపోయింది. నిజానికి ఈ సినిమాలో మాధవి చిరంజీవికి హీరోయిన్ కాదు. చిరంజీవికి తమ్ముడుగా నటించిన సుధాకర్ కు హీరోయిన్ గా నటించింది. చిరంజీవి సరసన కవిత హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత చిరంజీవి సరసన హీరోయిన్ గా ఛాన్స్ వస్తే.. క్యారెక్టర్ ఏదైనా, పారితోషికం కాస్త తగ్గినా నటిస్తానని అప్పట్లో మాధవి ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో చాలా సినిమాలొచ్చాయి.
ఇక కథ విషయానికొస్తే.. ఒక ఊరు.. అందులో చిరంజీవి-సుధాకర్ అన్నదమ్ములు. తమ్ముడ్ని కష్టపడి చదివిస్తాడు చిరంజీవి. ఎలాగైనా తమ్ముడ్ని డాక్టర్ ను చేసి ఊరిలో అందరికీ వైద్యం అందేలా చేయాలనేది అన్నయ్య తపన. పట్నం వెళ్లిన సుధాకర్ కు సాయంగా ఊరి వాళ్లు కూడా ఎప్పటికప్పుడు డబ్బులు పంపిస్తుంటారు. అలా ఊరి డబ్బుతో డాక్టర్ అయిన సుధాకర్, పట్నంలోనే ఉండిపోతాడు. అక్కడే మాధవిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. విషయం తెలుసుకున్న చిరంజీవి, పట్నం వెళ్లి తమ్ముడి భార్యను గ్రామానికి తీసుకొచ్చేస్తాడు.
భార్య కోసం ఊరొచ్చిన సుధాకర్, అనుకోని విధంగా ప్రమాదంలో పడతాడు. తమ్ముడి కోసం 7 మైళ్లు వెళ్లి డాక్టర్ ను తీసుకొస్తాడు చిరంజీవి. ఆ తర్వాత సుధాకర్ మారిపోవడం, ఊరికిచ్చిన మాటను నిలబెట్టుకోవడం జరుగుతాయి. ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతం అందించిన ఈ సినిమాలో కాంతారావు, గిరిబాబు, రావికొండల్రావు, జయమాలిని కీలక పాత్రలు పోషించారు. అమృతా ఫిలిమ్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాను సూర్యనారాయణ, వెంకట్రావ్ నిర్మించగా.. బాలయ్య దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్ ప్లే కూడా అతనివే. బి, సి సెంటర్లలో హిట్టయిన ఈ సినిమాకు ఉత్తమ తృతీయ చిత్రంగా నంది అవార్డు దక్కింది.
Must Read ;- ఇది కథ కాదు… కల్ట్ క్లాసిక్ కు 42 ఏళ్లు











