సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలా.. లేక థియేట్రికల్ రిలీజ్ వరకు వెయిట్ చేయాలా..? ఈ విషయంలో
టాలీవుడ్ రెండుగా చీలిపోయింది. కొంతమంది తమ సినిమాను నేరుగా ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేయాలని చూస్తున్నారు. తాము నిర్మించింది చిన్న సినిమానా, పెద్ద సినిమా అని వీళ్లు ఆలోచించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వదిలించుకోవడమే మంచిదనేది వీళ్ల అభిప్రాయం. మరికొందరు మాత్రం ఎప్పటికైనా పరిస్థితులు అనుకూలంగా మారుతాయని అంటున్నారు. అందుకే చేసినవి చిన్న సినిమాలే అయినప్పటికీ థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.
వీళ్ల అభిప్రాయాలు, ఆలోచనలు, వాదనలు, నిర్ణయాల సంగతి పక్కనపెడితే.. టాలీవుడ్ లో ఈ సీజన్ లో కూడా కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వబోతున్నాయి. ఫస్ట్ వేవ్ లో ఎలాగైతే ‘వి’, నిశ్శబ్దం లాంటి పెద్ద సినిమాలు ఓటీటీలో వచ్చాయో.. సెకెండ్ వేవ్ తర్వాత కూడా అదే విధంగా కొన్ని పెద్ద సినిమాలు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. వాటికి సంబంధించి ఇప్పటికే కొన్ని సినిమాల ఒప్పందాలు పూర్తికాగా, మరికొన్ని సినిమాలు అగ్రిమెంట్ల దిశగా దూసుకుపోతున్నాయి.
వెంకటేష్ నటించిన నారప్ప ముందు రిలీజ్ అవుతుందా లేక దృశ్యం-2 ముందు రిలీజ్ అవుతుందా..? ఈ రెండింటి మధ్యలో ఎఫ్3 వస్తుందా లేక తర్వాత రిలీజ్ అవుతుందా? మొన్నటివరకు దగ్గుబాటి అభిమానుల మధ్య ఈ తరహా చర్చలు, వాదోపవాదాలు కనిపించేవి. కానీ ఇప్పుడు అలాంటి చర్చలు అనవసరం. వెంకటేశ్ కు సంబంధించిన 2 సినిమాలు అస్సలు థియేటర్లలోకి రావడం లేదు. అవి నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి అనే అంతా అనుకున్నారు. తీరా ఇప్పుడు పరిస్థితి తారుమారైంది.
వెంకీ నటించిన దృశ్యం-2 సినిమా హాట్ స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ కింద స్ట్రీమింగ్ కు రాబోతోందని అన్నారుగానీ అది కూడా సందేహాస్పదమే. ఈ సినిమాను అటుఇటుగా 29 కోట్ల రూపాయలకు అమ్మేశాడు నిర్మాత సురేష్ బాబు. ఇక వెంకటేష్ నటించిన మరో సినిమా నారప్ప ఓటీటీ డీల్ కూడా పూర్తయిందంటున్నారు. తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ కు అప్పగించేశారు. దీన్ని రద్దు చేసుకుంటారేమో. వెంకీ నటిస్తున్న ఎఫ్3 సినిమా మాత్రం, థియేటర్లలోనే రిలీజ్ అవుతుంది.
అటు తన చేతిలో ఉన్న రెండు సినిమాలపై కూడా నిర్మాత బన్నీ వాస్ ఆలోచనలో పడ్డారు. ఈ నిర్మాత చేతిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రెడీగా ఉంది. రేపోమాపో ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. దీన్ని ఓటీటీకి ఇచ్చేయాలని బన్నీ వాస్ కు ఉంది. కానీ నాగార్జున నుంచి వ్యతిరేకత ఎదురౌతున్నట్టు తెలుస్తోంది. ఆ పంచాయతీ తేలితే సినిమా ఓటీటీకి రావడం పక్కా. అటు మరో సినిమా 18-పేజెస్ ను మాత్రం నేరుగా ఓటీటీకి ఇచ్చేయాలని చూచాయగా నిర్ణయించుకున్నాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించి అల్లు అరవింద్, వాస్ మధ్య చర్చలు సాగుతున్నాయి.
మరోవైపు పాగల్, విరాటపర్వం సినిమాలు కూడా డోలాయమానంలో ఉన్నాయి. విశ్వక్ సేన్, నివేత పెతురాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన పాగల్ సినిమా థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని విశ్వక్ అంటున్నాడు. కానీ నిర్మాత మాత్రం తన ప్రయత్నాల్లో తాను ఉన్నాడు. విరాటపర్వం సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా అనే చర్చలు సాగుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్ కాపీ (సెన్సార్ కాకుండా) సిద్ధంగా ఉంది. ఏదేమైనా కొత్త ప్రతిపాదనల ప్రకారం అక్టోబరు నెలాఖరు లోపు ఓటీటీలో సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ అయితే లేదు.
Must Read ;- అక్టోబరు వరకూ ఓటీటీకీ నో: తెలంగాణ ఫిలిం ఛాంబర్