బాలచందర్.. దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు. అప్పుడే కాదు, ఇప్పటికీ బాలచందర్ సినిమాలకు ఓ
ప్రత్యేక స్థానం ఉంది. దర్శకత్వంలో, కథల ఎంపికలో ఆయనంత వైవిధ్యాన్ని మరే దర్శకుడూ చూపించలేకపోయాడంటే అతిశయోక్తి కాదు. ఆయన ఎంచుకున్న కథావస్తువులు అలా ఉంటాయి. కమల్ హాసన్ హీరోగా బాలచందర్ తీసిన ఇది కథ కాదు సినిమా కూడా అలాంటిదే.
పాత్రల పేర్లు టచ్ చేయకుండా, నేరుగా నటీనటుల పేర్లతోనే సినిమా కథ సింపుల్ గా చెప్పుకుందాం. జయసుధ, శరత్ బాబును ప్రేమిస్తుంది. కానీ పెళ్లి చేసుకోవడం కుదరదు. దీంతో వేరే ఊరు వెళ్లిపోతుంది. అక్కడ చిరంజీవి పరిచయమౌతాడు. ప్రేమించానంటాడు. జయసుధ తన గతం మొత్తం చెబుతుంది. అయినప్పటికీ పెళ్లి చేసుకుంటానంటాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. బిడ్డ కూడా పుడతాడు. కానీ పెళ్లయిన రోజు నుంచి చిరంజీవి శాడిస్టు అని గ్రహిస్తుంది జయసుధ.
ఒక దశలో చిరంజీవికి దూరంగా బిడ్డను తీసుకొని మరో ఊరు వెళ్లిపోతుంది. ఓ ఆఫీస్ లో జాయిన్ అవుతుంది. అక్కడ కమల్ హాసన్ పరిచయమౌతాడు. అతడో వెంట్రిలాక్విస్ట్. అంటే చేతిలో బొమ్మ పెట్టుకొని, ఆ బొమ్మ మాట్లాడినట్టు మాట్లాడుతుంటాడు. జయసుధను కమల్ హాసన్ ప్రేమిస్తాడు. మరోవైపు చిరంజీవి తల్లి, మనవడి కోసం జయసుధ ఇంట్లో పనిమనిషిగా చేరుకుంది. అదే సమయంలో శరత్ బాబు మళ్లీ జయసుధకు దగ్గరవుతాడు. ఈసారి పెళ్లి చేసుకుంటానంటాడు.
అంతా ఓకే అనుకుంటున్న టైమ్ లో చిరంజీవి మరోసారి ఎంట్రీ ఇస్తాడు. జయసుధకు బాస్ గా ఆఫీస్ లో అడుగుపెడతాడు. టార్చర్ మొదలుపెడతాడు. శరత్ బాబుతో పెళ్లి కూడా చెడగొడతాడు. దీంతో జయసుధ,
కొడుకుతో మరో ఊరికి బయల్దేరుతుంది. సరిగ్గా అప్పుడే కమల్ హాసన్.. తన మనసులో మాట చెబుతాడు.
అప్పటికే మగాళ్లపై ఓ విరక్తి భావంతో ఉన్న జయసుధ.. కమల్ హాసన్ ను సున్నితంగా తిరస్కరిస్తుంది. నీ ప్రేమను గుర్తుపెట్టుకుంటానంటూ అక్కడ్నుంచి అలా వెళ్లిపోతుంది. అక్కడ శుభం కార్డు పడుతుంది.
అడుగడుగునా మనసును ద్రవింపజేసే సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమా అఖండ విజయం సాధించింది. థియేటర్లలో ఓ ఊపు ఊపేసింది. తమిళ్ లో వచ్చిన అవర్ గల్ అనే సినిమా ఆధారంగా తెలుగులో ఇది కథ కాదును తీశారు. తమిళ్ లో హీరోయిన్ గా సుజాత నటించారు. ఇక చిరంజీవి పోషించిన విలన్ పాత్రను తమిళ్ లో రజనీకాంత్ చేశారు. రెండు భాషల్లోనూ కమల్ హాసన్ హీరోగా నటించాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 2 నెలల పాటు వెంట్రిలాక్విజం నేర్చుకున్నారు కమల్ హాసన్. పాత్ర కోసం ఆయన పడే శ్రమ అలా ఉంటుంది.
సినిమాలో పాటలన్నీ హిట్. మరీ ముఖ్యంగా “ఇటు అటు కానీ.. హృదయం తోని..” అనే పాటైతే టాలీవుడ్ ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటి. ఈ సినిమాలో పాటలన్నింటినీ ఆత్రేయ రచించగా.. ఎమ్మెస్ విశ్వనాథన్ బాణీలు సమకూర్చారు. గణేష్ పాత్రో మాటలు అందించారు. చిరంజీవి విలన్ గా నటించిన అతికొద్ది చిత్రాల్లో ‘ఇది కథ కాదు’ కూడా ఒకటి.
Must Read ;- హలో బ్రదర్ లో.. నాగార్జున డూప్ గా నటించిన హీరో ఎవరో తెలుసా.?











