తరుణ్ భాస్కర్ పేరు వినగానే ‘పెళ్లిచూపులు‘ సినిమా గుర్తొస్తుంది. చిన్నసినిమానే అయినప్పటికీ పెద్ద విజయాన్ని సాధించింది. ఈ కథపై గల నమ్మకంతో సురేశ్ ప్రొడక్షన్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేశారు. అప్పటి నుంచి సురేశ్ బాబుతో తరుణ్ భాస్కర్ కి సాన్నిహిత్యం ఏర్పడింది. తరుణ్ భాస్కర్ ను చూసినవారు .. బాగానే ఉన్నాడు కదా సినిమాల్లో నటుడిగా కూడా ట్రై చేయవచ్చని అనుకున్నారు. సన్నిహితులు కూడా అదే మాట చెప్పారేమో . ఆయన అదే పని చేశాడు. దర్శకుడిగా కంటే కూడా ఈ మధ్య నటుడిగా బిజీ అయ్యాడు .. మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ తనకి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. “లాక్ డౌన్ సమయంలో నేను ఇంటి దగ్గరే ఉండిపోయాను. మంచి కథలను సిద్ధం చేసుకోవడానికి ఇంతకి మించిన మంచి అవకాశం దొరకదని అనుకున్నాను. అలా బాగా కసరత్తు చేసి రెండు కథలను సిద్ధం చేశాను. సురేశ్ బాబుతో సాన్నిహిత్యం ఉండటం వలన, ముందుగా ఆయనకి ఆ కథలను వినిపించాను. ఆ కథలు రెండూ కూడా సురేశ్ బాబుకి నచ్చాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో చెబుతాను” అని అన్నాడు.
“సురేశ్ బాబు కి నిర్మాతగా మంచి అనుభవం ఉంది. ఒక సినిమా గురించి ఆయన ఏదైతే చెబుతారో అదే జరుగుతుంది. ‘ఈ నగరానికి ఏమైంది? సినిమా విషయంలో అలాగే జరిగింది. ఈ సినిమా కథ వినగానే ‘పెళ్లి చూపులు‘ స్థాయిలో వసూళ్లు ఉండకపోవచ్చని అన్నారు .. ఎంత వసూలు చేస్తుందనేది కూడా చెప్పారు. థియేటర్స్ కి యూత్ మాత్రమే రావడం వలన వసూళ్లు ఒక స్థాయిని దాటకపోవచ్చని అన్నారు. సినిమా ఆన్లైన్ లోకి వచ్చాక అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని చెప్పారు. ఆయన ఎలా చెప్పారో అలాగే జరిగింది” అని తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు.
Must Read ;- అదే అందం .. అదే సొగసు .. అదే క్రేజ్











