ఇప్పుడు అన్నివర్గాల ప్రేక్షకులు జపించే మంత్రం పేరే ప్రభాస్. ఒక వైపున యూత్ ను .. మరో వైపున మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం ప్రభాస్ ప్రత్యేకత. ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ పటాన్ని ఆక్రమించిన ప్రభాస్, తన స్థాయికి తగిన ప్రాజెక్టులను ఎంచుకుంటూ వెళుతున్నాడు. బహుభాషా చిత్రంగా విడుదలైన ‘సాహో’ పరాజయం పాలైనప్పుడు, ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ రెట్టించిన ఉత్సాహంతో ఆయన మరిన్ని భారీ చిత్రాలను అంగీకరించాడు. ఆయన కొత్త ప్రాజెక్టులకి సంబంధించిన బడ్జెట్ వింటూ విస్మయానికి లోనుకానివారు లేరు. ఇంతటి భారీ ప్రాజెక్టులను ప్రభాస్ చేయనుండటం పట్ల ప్రభాస్ అభిమానులు సంతోష పడుతున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ ఎప్పటికి పూర్తయ్యేను అనే ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోంది. రొమాన్స్ పాళ్లు ఎక్కువగా ఉండే ఈ సినిమా ఎప్పుడు థియేటర్లకు రానుందా అని అభిమానులంతా వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీని ప్రకటించాడు. భారీతారాగణంతో విజువల్ వండర్ గా ఈ సినిమా రూపొందనుంది. ఆ వెంటనే హిందీ దర్శకుడు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశాడు. ‘రామాయణం’ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో కథానాయకుడు ప్రభాస్ అంటూ షాకిచ్చాడు. ఆ షాక్ నుంచి అభిమానులు తేరుకునేలోగానే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమాను ఎనౌన్స్ చేశాడు. మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో నాయకుడు ప్రభాస్ అంటూ అందరి దృష్టిని ఈ ప్రాజెక్టు వైపుకు తిప్పాడు.
ఒక సినిమా పూర్తయితేనేగానీ .. మరో సినిమాతో సెట్స్ పైకి వెళ్లే అలవాటు ప్రభాస్ కి మొదటినుంచీ లేదు. నిదానంగా .. నింపాదిగా తన సినిమా చేసుకుంటూ వెళ్లే తీరు ఆయనలో కనిపిస్తుంది. అలాంటి ప్రభాస్ తాజాగా ఒప్పుకున్న భారీ ప్రాజెక్టులను కూడా ఒకదాని తరువాత ఒకటిగా చేసే అవకాశమే ఉంది. ఒకవేళ రెండు ప్రాజెక్టులను సమాంతరంగా నడిపించాలని చూసినా ఈ సారి మాత్రం కుదరదు. ఎందుకంటే ఆయన అంగీకరించిన మూడు కథలు .. ఒకదానికొకటి పూర్తి వైవిధ్యభరితమైనవే. ఈ మూడు కథల్లోను నాయకుడిగా ఆయన డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు.
‘ఆది పురుష్’లో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించనున్నాడు. ఈ పౌరాణిక చిత్రంలో మీసాలు లేకుండా ఆయన కనిపించవలసి ఉంటుంది. ఇక ‘సలార్’ సినిమాలో మాఫియా ముఠాకి చెందిన ఒక నేరస్థుడి పాత్రను ప్రభాస్ పోషించనున్నాడు. రఫ్ గా .. పూర్తి మాస్ లుక్ తో ఆయన ఈ పాత్రలో కనిపించనున్నాడు. ఇక నాగ్ అశ్విన్ సైంటిఫిక్ సినిమాలో ప్రభాస్ లుక్ మరింత ప్రత్యేకంగా ఉండనుంది. అందువలన ఈ మూడు సినిమాల్లో .. ఏ రెండింటిని ఆయన ఒకేసారి చేసే అవకాశాలు లేవు.
ప్రభాస్ ఒప్పుకున్న ఈ మూడు సినిమాలు తక్కువలో తక్కువగా ఒక్కోటి ఏడాది సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అందువలన ఈ సినిమాలన్నీ ఒకదాని తరువాత ఒకటి పూర్తి కావలసిందే .. ఒకదాని తరువాత ఒకటి థియేటర్స్ కి రావలసిందే.
Must Read ;- ప్రభాస్ వెర్సెస్ పవన్.. బాక్సాఫీస్ ను షేక్ చేసేది ఎవరు..?
https://www.youtube.com/watch?v=MifZneOCmK0











