ఏపీలో ప్రభుత్వం అండతోనే దేవాలయాలు, విగ్రహాల ధ్వంసం జరుగుతోందని ఏపీ బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని చూడలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి నిజమైన ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని కన్నా దుయ్యబట్టారు. దేవాలయాల ధ్వంసం ఘటనల్లో అసలైన నిందితులను పట్టుకోకుండా ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం వల్ల ప్రయోజనం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
బీజేపీ నేతల గృహనిర్భంధం
ఏపీలో ప్రజాస్వామ్యం అనేది మచ్చుకైనా లేదని, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చెబుతూనే ఉన్నానని బీజేపీ నేత కన్నా విమర్శించారు. బీజేపీ నేతల గృహనిర్బందాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఏడాది నుంచి హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ఇప్పటి వరకు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన విమర్శించారు. ఏపీ పోలీసులు వైసీపీ నాయకులకు భజన చేస్తున్నారని కన్నా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేతకాని తనానికి మంత్రుల భూతులే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో ఇప్పుడు నిజమైన ఫ్యాక్షనిస్టుల పాలన చూస్తున్నామని కన్నా వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి చిద్దశుద్ధి ఉంటే దేవాలయాల ధ్వంసంలో అసలైన దోషులను పట్టుకోవాలని, చేతకాకే బీజేపీ కార్యకర్తలపై నెపం నెడుతున్నారని కన్నా తీవ్ర విమర్శలు చేశారు.
Must Read ;- బీజేపీ నిర్ణయిస్తే.. ఆ సీఎం వెనక్కి తగ్గాల్సిందే?











