వెండితెరపై పోలీస్ కథలు చాలానే షికారు చేశాయి. కంటెంట్ ఉన్న చాలా కథలు భారీ విజయాలను నమోదు చేశాయి.అయితే ఆ కథలన్నింటినీ మరిపించిన పోలీస్ కథ ఒకటి ఉంది .. అదే ‘ఖాకి’. ఈ పేరు వినగానే ఆ సినిమాలో దోపిడీ దొంగల పరుగులు గుర్తొచ్చి .. కాసేపు గుండెలు దడదడలాడతాయి. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కార్తి కెరియర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దొంగల ప్లానింగ్ ఎలా ఉంటుంది?ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పరిశోధన ఎలా సాగుతుంది? అనే విషయాన్ని వినోద్ ఆవిష్కరించిన తీరుకి ప్రశంసల వర్షం కురిసింది. అలాంటి దర్శకుడికి హీరో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

విజయ్ తన 64వ సినిమాగా చేసిన ‘మాస్టర్‘ తమిళనాట రికార్డుస్థాయి వసూళ్లను రాబడుతోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మాస్ ఆడియన్స్ నుంచి విపరీతంగా విజిల్స్ అందుకుంటోంది. ఈ సక్సెస్ తరువాత తన 65వ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేయడానికి విజయ్ రెడీ అవుతున్నాడు. గతంలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ‘కోలమావు కోకిల’ అనూహ్యమైన స్థాయిలో విజయాన్ని అందుకుంది. చాలా తక్కువ బడ్జెట్ లో చేసిన ఈ సినిమా చేశారు. నయనతార చేసిన పాత్ర .. ఆమె పోషించిన వైవిధ్యభరితమైన పాత్రల్లో ఒకటిగా నిలిచింది. అలాంటి దర్శకుడి కాంబినేషన్లో విజయ్ చేస్తుండటం పట్ల అభిమానులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక విజయ్ .. తన 66వ సినిమా దర్శకత్వ బాధ్యతలను వినోద్ కి అప్పగించాడన్న మాట. ప్రస్తుతం వినోద్ .. అజిత్ హీరోగా ‘వలిమై’ సినిమా చేస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇంతవరకూ తాను చేసిన పాత్రలు ఒక ఎత్తు .. ‘వలిమై’లో చేసిన పాత్ర ఒక ఎత్తు అని అజిత్ చెప్పడంతో ఆయన అభిమానుల్లో అంచనాలు పెరుగుపోతున్నాయి. వినోద్ ఈ సినిమాను విడుదలకు ముస్తాబు చేసిన తరువాత, విజయ్ కథను పట్టాలెక్కించనున్నాడన్న మాట.
Must Read ;- ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ అనౌన్స్ మెంట్.. హీరో ఎవరో తెలుసా.?











