(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
వాలంటీర్ వ్యవస్థ రాకతో వైసీపీ కేడర్‌ను పక్కకు పెట్టేశారా? వాలంటీర్ వ్యవస్థ యాక్టివ్ అవ్వడంతో వైసీపీ కార్యకర్తల్లో నైరాశ్యం.. అసంతృప్తి నెలకొందా.. ? ఏడాది కాలంగా ఆ సీనియర్ నేత పదే పదే చెబుతున్న మాటకు ఇప్పుడు మరొకరు స్వరం కలిపారు. ఒకే వేదికగా తమ మనసులో మాట బయటపెట్టేశారు. ఉత్తరాంధ్ర పార్టీ ఇంచార్జ్, ఇతర ముఖ్యనేతల సమక్షంలో చేసిన ఆ కామెంట్స్ ఇప్పుడు పార్టీలోనూ , ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వైసీపీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని ధర్మాన సోదరులు కృష్ణదాస్, ప్రసాదరావు చేసిన కామెంట్స్‌పై శ్రీకాకుళం జిల్లాలో పెద్ద చర్చే జరుగుతోంది. తొమ్మిదేళ్లగా ప్రతిపక్ష పాత్ర పోషించి.. అధికారంలోకి వచ్చాక తీసుకున్న కొన్ని నిర్ణయాలు కేడర్‌కు ప్రతికూలంగా మారుతున్నాయని ఓపెన్‌గానే చెప్పేశారు ధర్మాన బ్రదర్స్.
సంక్షేమ పథకాలు మంచిపేరు తెస్తున్నా ..
సంక్షేమ పథకాలు మంచి పేరు తీసుకొస్తున్నా.. వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి రాజేస్తోందన్నది వారి మాటల్లోని సారాంశంగా తెలుస్తోంది. ఏడాది క్రితం వాలంటీర్, సచివాలయం వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు అహో.. ఓహో అన్న నాయకులు.. దేశానికే ఆదర్శమని చెప్పినవారు ఇప్పుడు వాలంటీర్ అంటేనే మండిపడే పరిస్థితి ఉందని ఓపెన్ అయిపోయారు. వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిన మూడు నెలలకే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కేడర్‌కు పనిలేకుండా పోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమకు గుర్తింపు లేదని పదే పదే నాయకుల దగ్గర వాపోయిన సంఘటనలూ ఉన్నాయి. ఏడాది క్రితం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తల మనసులో ఉన్న మాటను ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు బయటకు చెప్పి సంచలనం రేపారు. అదే సమావేశానికి వచ్చిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాత్రం తమ్ముడితో విభేదించారు. పార్టీలో ఎలాంటి అరమరికలు లేవని.. కేడర్ ఫుల్ హ్యాపీగా ఉందని తెలిపారు.
Must Read ;- తీవ్ర అసంతృప్తిలో వైసీపీ కార్యకర్తలు : ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్
ఏడాది తిరిగే సరికి ..
క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏ అవసరాలు ఉన్నా.. తమకు అందుబాటులో ఉన్న అధికార పార్టీ నేతల చెంతకు వెళ్లడం ఇన్నాళ్లుగా వస్తున్న ఆనవాయితీ. ప్రజలను అధికారుల దగ్గరకు తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకునేవారు. పెద్ద సమస్య అయితే ఎమ్మెల్యే దగ్గర పెట్టేవారు. టీడీపీ హయాంలో జన్మభూమి పేరుతో తెలుగు తమ్ముళ్లుకు ఎంతో డిమాండ్ ఉండేది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలకు పార్టీ నేతలతో అవసరమే లేకుండా పోయింది. ఏం కావాలన్నా వాలంటీర్లకు చెబుతున్నారు. సచివాలయాలకు వెళ్లి పరిష్కరించుకుంటున్నారు.
గతంలో రోడ్డుపై అధికార పార్టీ నేతలు కనిపిస్తే ఆగి పలకరించేవారు… నమస్కారం పెట్టేవారు ప్రజలు. ఇప్పుడు పలకరింపులు లేవు.. తలెత్తి చూసే వారే కరువయ్యారు. మొత్తంగా కేడర్‌కు పని, గుర్తింపు రెండు లేకుండా పోయాయి. ఆ విషయాన్నే అప్పట్లో .. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. ఈ విషయంలో ఒకప్పుడు తమ్ముడితో విభేదించిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ రీలైజ్ అయ్యారో ఏమో.. ప్రసాదరావు లైన్లోకి వచ్చేశారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగించిన ప్రసాదరావు, కృష్ణదాస్‌లు ఇద్దరు పార్టీ కేడర్ అసంతృప్తితో ఉన్నారని కామెంట్ చేయడం టాక్ ఆఫ్ ది సిక్కోలుగా మారింది.
సాయిరెడ్డి సమక్షంలోనే..
ఉత్తరాంధ్ర వైసీపీ ఇంఛార్జ్ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలోనే ధర్మాన బ్రదర్స్ ఈ వ్యాఖ్యలు చేయడంతో మరింత ప్రాధాన్యం లభించింది. రానున్న రోజుల్లో పార్టీకి నష్టం చేకూర్చకముందే దిద్దు బాటు చర్యలు చేపట్టాలని నాయకులు కోరుతున్నారని మనసులో మాట బయట పెట్టారు. అయితే కార్యకర్తల మనసులో ఉన్న మాటను బయటపెట్టడం వ్యూహాత్మకమా లేక వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారా అనే చర్చ కూడా ప్రస్తుతం జరుగుతోంది. ఈ విషయంపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Also Read ;- రైతు ఆత్మహత్య.. వైసీపీ అభిమానినంటూ సిఎంకు లేఖ..