గుంటూరు జిల్లా సత్తెనపల్లి బీజేపీ నేత మందడపు శ్రీనివాసరావును ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిన్న తెల్లవారు జామున ఇద్దరు పోలీసులు వచ్చి శ్రీనివాసరావును తీసుకెళ్లారని తెలుస్తోంది. పోలీసులను కుటుంబసభ్యులు ప్రశ్నించగా ప్రకాశం జిల్లా అని మాత్రమే చెప్పారని మందడపు శ్రీనివాసరావు భార్య శిరీష వెల్లడించారు. దేవాలయాలపై దాడుల కేసుల్లో సిట్ బృందం విచారిస్తున్న నేపథ్యంలో మందడపు శ్రీనివాసరావును అరెస్టు చేయడం కలకలం రేపింది.
సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
బీజేపీ సీనియర్ నేత మందడపు శ్రీనివాసరావును పోలీసులమని చెప్పి ఇద్దరు వ్యక్తులు పట్టుకెళ్లారని అప్పటి నుంచి ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదని ఆయన భార్య శిరీష సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు పెద్దగా స్పందించలేదని శిరీష వాపోయారు. దేవాలయాలపై దాడులను సోషల్ మీడియాలో ఖండించినందుకే పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారని ఆమె ఆరోపిస్తున్నారు. శ్రీనివాసరావు అరెస్టును బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. హిందూ దేవాలయాలపై దాడుల ఘటనల్లో ఇప్పటికే ఐదుగురు బీజేపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని సోము తీవ్రంగా తప్పు పట్టారు.
Must Read ;- మతమార్పిడుల కోసమేనా పాస్టర్లకు జీతాలిస్తోంది: సోము వీర్రాజు











