ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీని వీడనున్నారని తెలుస్తోంది. కన్నా పార్టీ మారే అంశాన్ని గుంటూరు కన్నావారితోట వర్గాలు దృవీకరిస్తున్నాయి. 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు వైసీపీలో చేరాలని కన్నా అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఫ్లెక్లీలు, బ్యానర్లు ఫ్రింట్ వేయించారు. ఇక తెల్లారితే వైసీపీలో చేరతారనగా మొత్తం రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కేంద్ర బీజేపీ పెద్దల హామీతో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రెండేళ్లు బీజేపీ అధ్యక్షుడిగా పార్టీని నడిపించారు. అయితే బీజేపీని నడిపించడంలో కన్నా విఫలం అయ్యారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన ఉంటే ఏపీ బీజేపీ తలరాత మారదని గ్రహించిన, కేంద్ర పెద్దలు దూకుడుగా వెళ్లే వీర్రాజును నియమించారు. తనను వాడుకున్న బీజేపీ నేతలు ఏదైనా పదవి ఇవ్వకపోతారా అని ఆరు నెలలుగా కన్నా వేచి చూస్తున్నారు. అందరికీ పదవులు వస్తున్నా, తన పేరు మాత్రం లిస్టులో లేకపోవడంతో ఇక బీజేపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
సోము వీర్రాజుతో విభేదాలు కూడా కారణమట..
కన్నా బీజేపీని వీడటానికి సోము వీర్రాజు వ్యవహార శైలి కూడా కారణమని తెలుస్తోంది. సోము వీర్రాజు ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టాక, కన్నా మీడియా ముందుకు రాలేదు. బీజేపీని ఎక్కడా విమర్శించ లేదు. ఏదైనా పదవి రాకపోతుందా? అనే ఆశతో బీజేపీలోనే కొనసాగారు. కన్నాకు ఎలాంటి పదవి దక్కడం సోము వీర్రాజుకు ఇష్టం లేదట. ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలు ఒకే పార్టీలో ఉంటే భవిష్యత్తులో తన ఎదుగుదలకు ఇబ్బంది అవుతుందని సోము భావించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అందుకే కన్నాకు ఏ పదవి రాకుండా సోము కేంద్ర పెద్దల వద్ద చక్రం తిప్పాడని తెలుస్తోంది. ఈ విషయం గమనించిన కన్నా బీజేపీని వీడాలనే ఆలోచనలో టీడీపీనేత మాజీ మంత్రి పుల్లారావుకు టచ్ లోకి వచ్చారట.
Must Read ;- సోము వీర్రాజు లక్ష్యం చిరంజీవిని సీఎంగా చేయడమేనా!!
టీడీపీలో చేరే అవకాశం
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కన్నా కాంగ్రెస్ పార్టీలో ఉండగా, చంద్రబాబుపై ఒంటికాలిపై లేచేవారు. అప్పటి అవసరం అలాంటిది మారి. అలా లేవబట్టేగా ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రి పదవి దక్కింది. ఇక బీజేపీ అధ్యక్షుడు అయ్యాక మాత్రం టీడీపీ మీద ఈగ వాలనీయలేదు. అది చంద్రబాబుమీద ప్రేమఅని చెప్పలేం కాని, ఆయన ఎక్కువగా వైసీపీనే టార్గెట్ చేశారు. రాజధానిని తరలించడం వల్ల కన్నాకు కూడా భారీ నష్టమే వాటిల్లిందట. గుంటూరు సమీపంలో ఆయన పెద్ద ఎత్తున భూములు కొన్నారని తెలుస్తోంది. అమరావతిని మూడు ముక్కలు చేయడం. అసలు అమరావతిలో రాజధాని లేకుండా చేయాలని చూడటంతో వైసీపీ నేతల తీరుపై కన్నా గట్టిగానే విరుచుకుపడ్డారు. ఇక బీజేపీలో కన్నా చరిత్ర ముగిసినట్టే తెలుస్తోంది. టీడీపీలో సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ హామీ లభిస్తే ఆ పార్టీ తీర్థం స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. కన్నాతో సన్నిహిత సంబంధాలు ఉన్న మాజీ మంత్రి పుల్లారావు, టీడీపీ అధినేతతో హైదరాబాద్ లో చర్చలు సాగిస్తున్నారని తెలుస్తోంది. అధినేత గ్రీన్ సిన్నల్ ఇస్తే కన్నా బీజేపీని వీడి టీడీపీలోకి రావడం ఖాయం.
కావాలనే చేస్తున్నారా?
కన్నా బీజేపీకి వీడుతున్నారంటూ వారే కావాలని పుకార్లు పుట్టించారా? కనీసం ఇవి చూసి అయినా కన్నాకు బీజేపీ మంచి పదవి ఇస్తుందని ఇదంతా చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. టీడీపీలో చేరడానికి కన్నా సుముఖంగా ఉన్నా, కొంత కాలం ఈ విషయం బాగా జనంలో నానే వరకూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని కూడా తెలుస్తోంది. ఒక్కోసారి నో డెసిషన్ ఈజ్ ద బెస్ట్ డెసిషన్ అంటారుగా. అదే సూత్రం టీడీపీ అధినేత పాటిస్తారనే సమాచారం షికార్లు చేస్తోంది.
Also Read ;- పెద్దలకు మింగుడు పడని సోము వీర్రాజు తీరు