(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
దేవుళ్లపై, విగ్రహాలపై దాడులు జరిగినా ప్రభుత్వం ఏమీ చేయడం లేదని.. ఇప్పటి వరకు నిందితుల్ని పట్టుకోలేదని.. అన్యాయాలను ప్రశ్నించినవారిని అరెస్ట్ చేస్తున్నారని, కేసులు పెడుతున్నారని.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పట్టిన గతే ముఖ్యమంత్రి జగన్‌కు పడుతుందని .. అరెస్టులకు భయపడేది లేదని, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటామని, ప్రభుత్వ అక్రమాలపై నిలదీస్తునే ఉంటామని టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు సుస్పష్టం చేశారు. బుధవారం రాత్రి తనని విజయనగరం పోలీసులు ఆకస్మికంగా అరెస్టు చేసి .. అర్థరాత్రి విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
హీట్ పెంచిన పోలీసుల హైడ్రామా
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్ లో పోలీసులు నిర్వహించిన హైడ్రామా రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. బుధవారం రాత్రి కళా వెంకట్రావును విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంరేపింది. తెలుగుదేశం శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా వెనువెంటనే స్పందించాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొదలు గ్రామీణ కార్యకర్త వరకు ఆగ్రహించారు. విజయనగరం టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, శ్రీకాకుళం జిల్లా టీడీపీ నాయకుడు కిమిడి గణపతిరావు నేతృత్వంలో రెండు జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చీపురుపల్లి పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. సీఎం డౌన్ .. డౌన్ అంటూ నినదించారు. పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన పోలీసు యంత్రాంగం కళాను రాత్రి 11.15 గంటలకు విడుదల చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.
Must Read ;- కళా అరెస్టును ఖండిస్తున్నాం : అచ్చెన్న
అర్థరాత్రి ఎస్పీ మీడియా మీట్
కళా వెంకట్రావు అరెస్ట్‌పై విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి బుధవారం అర్ధరాత్రి మీడియా మీట్ ఏర్పాటు చేశారు. కారణాలను వివరించారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఈ నెల 2న విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారని..ఆ కేసు నిమిత్తం విచారణ కోసం కళా వెంకట్రావును హాజరుకావాలని పలుమార్లు కోరామన్నారు. ఆయన సరిగా స్పందించకపోవడంతో పిలిచి విచారణ తర్వాత నోటీస్ ఇచ్చి తిరిగి పంపించామన్నారు.
నేపథ్యం ..
తెలుగు దేశం పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావును బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి కళా వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం ధ్వంసం తర్వాత ఆలయాన్ని పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, విజయసాయిరెడ్డి ఒకే రోజు వచ్చారు. అయితే చంద్రబాబు కంటే విజయసాయిరెడ్డి ముందుగా రామతీర్థం వచ్చారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు విజయసాయి కారుపై దాడికి పాల్పడ్డారు. దీనిపై విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్కంఠ.. ఉద్రిక్తత
కిమిడి కళా వెంకటరావుది విలక్షణ రాజకీయ శైలి. దశాబ్దాలుగా రాజకీయాల్లో నెట్టుకొస్తున్నారు. సౌమ్యుడిగా అందరికీ సుపరిచితుడు. అటువంటి వ్యక్తిని బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలియటంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తెదేపా శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. ఈ విషయం తెలుసుకొని పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రాజాంలోని కళా స్వగృహానికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై భగ్గుమన్నారు. రాత్రివేళ ఎవరూ లేని సమయంలో ఇలా వ్యవహరించటం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చీపురుపల్లిలోని పోలీసు స్టేషన్‌లో ఉంచారని తెలుసుకొని అప్పటికప్పుడు ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. తెదేపా నేతలు కిమిడి గణపతిరావు, చౌదరి బాబ్జి, తదితరులు స్టేషన్‌కు చేరుకున్నారు. కళాను తక్షణమే విడుదల చేయాలని కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసు బలగాలు పెద్దఎత్తున మోహరించారు. ఈ ఘటనపై జిల్లా నాయకులు వెనువెంటనే తీవ్రంగా స్పందించారు. అవి వారి మాటల్లోనే…
AlsoRead ;- చంద్రబాబు స్కెచ్ వేశారా? స్కెచ్‌లో పడ్డారా?
తెలుగు దేశం పోలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు గారిని అక్రమంగా అరెస్ట్ చెయ్యడం ఖండిస్తున్నాను. రామతీర్ధం సంఘటన గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, పోలీసులు అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేస్తారా? మీ అరెస్టులతో టీడీపీ ని భయపెట్టలేరు CM గారు. ఇది మీ చేతకానితనాన్ని నిరూపిస్తుంది. pic.twitter.com/hIWCFNWi40
— Ram Mohan Naidu K (@RamMNK) January 20, 2021
పాశవిక చర్య ..
కళా వెంకటరావును పోలీసులు అదుపులోకి తీసుకోవడం పాశవిక చర్య. రామతీర్థంలో జరిగిన ఘటనలో నిందితులను పట్టుకోకుండా ఇదేమని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇది ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం. రాష్ట్రంలో వరుసగా దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసేవారిని విడిచి ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని కేసుల్లో ఇరికిస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన కంటే కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆలయాల్లో దేవుడి విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వారిపై పోలీసులు కేసులు పెట్టకుండా, వాటిని తప్పు అని ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు.
– కింజరాపు రామ్మోహన్‌నాయుడు, శ్రీకాకుళం ఎంపీ
Also Read ;- రామతీర్థంలో అంతా రహస్యం.. ఎందుకో ?
శాంతిభద్రతలు కొరవడ్డాయి ..
రాష్ట్రంలో శాంతిభద్రతలు కొరవడ్డాయి. తెదేపా నాయకులను ఏదో ఒక సాకుతో అరెస్టు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విజయసాయిరెడ్డి కారుపై రాళ్లు, చెప్పులు వేశారనే నెపంతో ఎలా అదుపులోకి తీసుకుంటారు. దేవాలయాల్లోని విగ్రహాలను ధ్వంసం వంటి చర్యలకు పాల్పడేవారిని ప్రభుత్వం పట్టుకోలేకపోవడం చేతకాని పాలనకు నిదర్శనం.
గౌతు శిరీష, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఫ్యాక్షన్ రాజకీయాలకు పరాకాష్ట
రామతీర్థం ఘటనలో కళా వెంకటరావుపై తప్పుడు కేసు పెట్టి ఇబ్బంది పెట్టడం ముఖ్యమంత్రి ఫ్యాక్షన్ రాజకీయాలకు పరాకాష్ట. ఏ ప్రజలైతే ఓట్లు వేసి గెలిపించారో వారే ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం అనివార్యం అవుతుంది. దేవాలయాలను రక్షించాలని పోరాడుతుంటే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం తగదు.
– కూన రవికుమార్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు.
అరాచకాలతో జగన్ పాలన గాడి తప్పింది
రాష్ట్రంలో ఆందోళన కరమైన పరిస్థితులు నెలకొన్నాయి.
జగన్ అరాచకాలతో పాలన గాడి తప్పింది. దేవాలయాలపై దాడులను ప్రశ్నించి నిరసిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు.
అర్ధరాత్రి పూట మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్ చేయడం హేయమైన చర్య. రామతీర్థంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణం విజయసాయిరెడ్డి. పార్టీ జెండాలతో రామతీర్థం కొండ ఎక్కి పవిత్ర ప్రాంతాన్ని విజయసాయిరెడ్డి అపవిత్రం చేశారు. విజయసాయిరెడ్డి పై కేసులు పోలీసులు పెట్టాలి. ఆయన్ని అరెస్ట్ చేయాలి. రామతీర్థం ఘటనను తప్పుదారి పట్టించేందుకు కుట్ర జరుగుతోంది. రాములవారి శిరచ్ఛేదం చేసిన దుర్మార్గులను నేటి వరకు పట్టుకోలేని పోలీసులు విజయసాయిరెడ్డి కారుపై చెప్పులు విసిరారంటూ హడావిడి చేస్తున్నారు. మాజీమంత్రి కళా వెంకట్రావు అరెస్టు ముమ్మాటికీ దుర్మార్గపు చర్య. ఆయన రాముల వారి పక్షాన నిలబడటం అన్యాయమా. ప్రతీ ఒక్కరూ కళా
అరెస్టును ఖండిస్తున్నారు.
-సుజయ్ కృష్ణ రంగారావు. మాజీ మంత్రి. విజయనగరం.
Also Read ;- రాజకీయ రణతీర్థం విజయసాయి వాహనంపై చెప్పులు