బుచ్చిబాబు .. ‘ఉప్పెన’ సినిమాకి ముందు ఈ పేరుగల ఈ వ్యక్తి ఎవరికీ తెలియదు. కానీ ఆ తరువాత ఈ పేరు తెలియని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఆయన పేరు జనం నోళ్లలో నానుతోంది. చూడటానికి ఆయన చాలా సింపుల్ గా కనిపిస్తాడు .. కాస్త సిగ్గరిగానే అనిపిస్తాడు. కొత్త పాఠాలు నేర్చుకునే కుర్రాడి మాదిరిగానే ఎప్పుడు చూసినా చేతులు కట్టుకునే ఉంటాడు. ఆయనను చూసిన వాళ్లంతా ఇంత అందమైన ప్రేమకథను తెరపై ఇంత అందంగా ఆవిష్కరించింది ఈయనా? అనుకుంటున్నారు .. ఆశ్చర్యపోతున్నారు.
అలాంటి బుచ్చిబాబు .. రాజమండ్రిలో జరిగిన ‘ఉప్పెన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’ వేదికపై మాట్లాడాడు. “నేను ‘ఉప్పెన’ కథ రాసుకున్నప్పుడు ముందుగా నా గురువుగారు సుకుమార్ కి వినిపించాను. ఆ కథకి వైష్ణవ తేజ్ అయితే బాగుంటాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. ఆయనకి కథ వినిపిస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని చెప్పాను. అయితే అంతకంటే ముందుగా చరణ్ కి వినిపించాలనీ, మిగతా విషయాలను ఆయనే చూసుకుంటాడని సుకుమార్ గారు నన్ను అక్కడికి తీసుకెళ్లారు. చరణ్ గారికి కథ చెప్పగానే, వెంటనే ఆయన చిరంజీవిగారితో .. వైష్ణవ్ తేజ్ తో సిట్టింగ్ ఏర్పాటు చేశారు.
చిరంజీవిగారి ఇంట్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు, “బుచ్చిబాబుపై నాకు నమ్మకం ఉంది .. ఆయన ఎలా అనుకుంటున్నాడో అలాగే చేయనిద్దం” అంటూ చరణ్ నాపై నమ్మకంతో మాట్లాడారట. ఆ విషయం తెలిసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. నాపై అంతటి నమ్మకం ఉంచిన చరణ్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే నన్ను ప్రోత్సహించిన సుకుమార్ గారికీ, మైతీవారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించడంలో ప్రధానమైన పాత్రను పోషించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు.











