టాలీవుడ్ లో ఎప్పటికీ క్లాసిక్ గా నిలిచిపోయే సినిమా ‘మాతృదేవోభవ’. 1991లో విడుదలైన ఈ సినిమాలో మాధవి, నాజర్ ప్రధానపాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. మహిళా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న ఈ సినిమాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాటకు గాను వేటూరి నేషనల్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్.
ఈ సినిమా విడుదలై.. ఇప్పటికి దాదాపు మూడు దశాబ్దాలు అవుతుంది. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కె.యస్.రామారావు నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు కె. అజయ్ కుమార్. అలాంటి ఈ సినిమాను ఇప్పటి జనరేషన్ ప్రేక్షకుల కోసం మళ్ళీ రీమేక్ చేస్తానని చెబుతున్నారు కె.యస్.రామారావు.
నిజానికి మాతృదేవోభవ సినిమా .. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘ఆకాశదూత్తు’ కి రీమేక్ వెర్షన్. అందులో మాధవి, మురళి జంటగా నటించారు. అక్కడ కూడా ఇదే రేంజ్ లో సూపర్ హిట్ గా నిలిచి క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది. అయితే మరోసారి అదే దర్శకుడు అజయ్ కుమార్ తో ఈ సినిమాను తెలుగులో మరోసారి రీమేక్ చేస్తారట. ఇటీవల తెరవెనుక కథలు అనే యూ ట్యూబ్ టాక్ షో లో పాల్గొన్నారు కె.యస్.రామారావు.
స్టార్ హీరోయిన్ నయనతారతో ఈ సినిమాను రీమేక్ చేయాలని ఉందని నిర్మాత చెబుతున్నారు. అలాగే.. కీర్తిసురేశ్, అనుష్క ను కూడా అనుకున్నారట. అయితే భారీ పారితోషికం తీసుకొనే నటీనటులతో కాకుండా.. తక్కువ బడ్జెట్ లో ఎవరు వస్తారో వారితోనే సినిమాను రీమేక్ చేస్తానని చెబుతున్నారు రామారావు. మరి ఏ హీరోయిన్ తో చేస్తారు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.
Must Read ;- రీమేక్ అని ప్రకటించడానికి అభ్యంతరం ఏంటి? కారణం అదేనా?











