అందరూ ట్వీట్లు చేస్తారు.. ప్లాస్మా ఇవ్వండి.. ఆక్సిజన్ ఇవ్వండి.. అని కోరతారు. ఆయన నుంచి అలాంటి మాటలుండవ్.. మాట్లాడుకోవడాలుండవ్.. చేతల్లో చేసిచూపామా లేదా అన్నదే ఆయనకు ముఖ్యం. ఒక వ్యవస్థ చేయలేని పనిని ఒక వ్యక్తి చేస్తుంటే ఎలాంటివారైనా అతన్ని ఆకాశానికి ఎత్తడం తప్పదు. ఈరోజున అలాంటి ఘనత ఎవరికైనా దక్కింది అంటే అది సోనూ సూద్ ఒక్కడే. ఒకే ఒక్కడిని యావత్ భారతదేశం కీర్తిస్తోంది అంటే అది నిజంగా అతని గొప్పతనమే. అతను సోనూ సూద్ అని చెప్పకపోయినా ఎవరైనా అతనేనని ఊహించేసుకుంటారు. పైగా ఇది అతని బాధ్యతను మరింత పెంచేస్తోంది.

ఇంత పెద్ద బాధ్యతను అతను భుజానికెత్తుకోవడం ఒకవిధంగా సాహసమే. అతను చేస్తున్న ఇలాంటి పనివల్ల తమకు చెడ్డ పేరు వస్తుందని కొందరు భయపడవచ్చు కూడా. హీరోలు చేయలేని పని ఇతనను చేయడం ఏమిటని అనుకోవచ్చు కూడా. అలా అనుకుంటే అది నిజంగా అమానుషమే కాబట్టి అలా అనుకే సాహసాన్ని కూడా ఎవరూ చేయరు. పైపెచ్చు సోనూ చేస్తున్న పనికి ప్రశంసలు దక్కుతున్నాయి. నిన్న కాకమొన్న క్రికెటర్ సురేష్ రైనా ‘నువ్వు దేవుడి కంటే ఎక్కువ’ అంటూ సోనూను కీర్తించాడు. సురేష్ రైనా కోరిన 10 నిమిషాల్లోనే అతను కోరినట్లు ఆక్సిజన్ సిలిండర్ను పంపి తానేమిటో నిరూపించుకున్నాడు.
తాజాగా తెలుగు దర్శకుడు మెహర్ రమేష్ ట్విట్టర్ లో వెంకట రమణ అనే పేషెంట్ కోసం కొన్ని ఇంజక్షన్లు, మందులు కావాలని కోరారు. కేవలం 24 గంటల వ్వవధిలోనే సోనూసూద్ ఆ మందులను అందించే ఏర్పాటుచేశారు. సోనూసూద్ చేసిన సాయానికి మెహర్ రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. సోనూ సూద్ ప్రస్తుతం బెడ్స్, ఆక్సిజన్ లేని కోవిడ్ పేషెంట్లకు తన వంతు సహకారం అందిస్తున్నారు. కరోనా మొదటి వేవ్ లో సోనూ చేసిన సాయానికి రెట్టింపు సేవలను ఈ సెకండ్ వేవ్ లోనూ సోనూ చేస్తున్నారు.
ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి ఓ ఫౌండేషన్ ఉంటే మంచిదని సోనూ ఛారిటీ ఫౌండేషన్ ఏర్పాటుచేశారు. ఈ ఫౌండేషన్ కు సహకరించడానికి బాలీవుడ్ ప్రముఖులు ఎందరో ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ ఈ ఫౌండేషన్ కు సహకారం అందించింది. ఆమె ఇలా చేసినందుకు ట్విట్టర్ ద్వారా సోనూ ఆమెను అభినందించారు. ‘డియర్ సారా మీ సహకారానికి కృతజ్ఞతలు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. మీలాంటి యువత ఇలా స్పందించి సహాయం చేయడం దేశ యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.. మీరే హీరో’ అని ట్వీట్ చేశారు.











